Your Ad Here

కను రెప్పలపై ముద్దాడే కథలు అవి


కొన్ని కథలు ముద్దు పెట్టుకున్నాయండీ నన్ను..నిద్దట్లో ముద్దు పెట్టుకోకూడదు అన్నా వినకుండా పాపాయిని ముద్దు పెట్టుకుంటామే అలాగ.తిలక్ అన్నట్టు పండిన మొగలిపొత్తి మొదలులా వాసన కొడ్తాయి.వంశీ రాసినట్టు చలికాలంలో దుప్పటి సందుల్లోంచి దూరి కితకితలు పెట్టే గోదారి గాలిలా పులకలు రేపుతాయి.సత్యం శంకరమంచి అన్నట్టుగా గాలికీ వెన్నెలకీ కూడా వాటి వాసన వచ్చి గుబాళిస్తాయి.అలాంటి కథలు ఉంటాయా అంటే ఉంటాయి.
కథలు భలే ఉంటాయి మొత్తంగా మనల్ని చుట్టు ముట్టేస్తాయి.కళ్ళకు కట్టినట్టు అన్న మాటని వెక్కిరిస్తూ అవి వినిపిస్తాయి గుబాళిస్తాయి నిమురుతాయి చదువుతున్నంతసేపే కాదు అయ్యిపోయాకా కూడా.
మధ్యన ఉపన్యాసంగా చెప్పవలసినవి కథలుగా రాసి సంభాషణల్లో చెప్పే టైపు కథలు వేస్తున్నారు గానీ నాలుగేళ్ళ క్రితం వరకూ ఈనాడు ఆదివారంలో కథలు బావుండేవి.
సేంపిల్ కి పుష్కరాల టైం లో "వెండి పట్టీలు"అని ఒక కథ వచ్చింది విషయం ఏంటి అంటే చెప్పడం కష్టం గానీ మన చుట్టూ గోదావరి ఆ యాస ఆప్యాయతలు ఆవకాయ వెన్నపూసా ఇలాంటి దినుసులతో ఒక అందమైన బొమ్మరిల్లు కడ్తుంది ఆ కథ చదివినంత సేపు,పైగా వెండి పట్టీల శబ్దం వింపిస్తూనే ఉంటుంది త్రూ-అవుట్. ఇంకో కథ "మనసులో వాన" ఇదీ పై కథ లాంటిదే మంచి కాఫీ లాంటి కథ(ఫీల్ గుడ్ అన్న మాట).కానీ కొంత సందేశం ఉంటుంది.
రస రాజు గారు రాసిన మరో కథ(పేరు గుర్తు లేదు).అందులో ఒకడు నోటి దురద కొద్దీ ఊరి పెద్ద ఇంట్లో భోజనాలు అయ్యాకా అర్ధాకలి తో పంపేసారని వాగుతాడు.అప్పటి నుండి ఆ ఊరిపెద్ద బావ కం అనుచరుడు నరహరి వాళ్లింట్లో ఏ భోయనాలు ఉన్నా ఆ నోటి దురద కాండిడేట్ ని పిల్చి భోజనం పెట్టీ పెట్టీ చంపేస్తాడు.అసలు నవ్వు ఆపుకోలేక మనం భోజనం చెయ్యలేక వాడు చావాలి పొట్ట చెక్కలై.
ఇంక అప్పుడెప్పుడో చదివిన బాపు గారి "మబ్బూ-వానా-మల్లె వాసనా"కూడా మతి పోగొట్టి మనసుని నింపే కథే.మన హీరోకి తన భార్య చెంప మీద చెంప ఆనించుకుని వాన చూడాలని,మల్లె పూలు పెట్టుకుంటే గాఢంగా వాసన చూసి సీతా నీ జడలో ఈ మల్లేపూలు ఎలా ఉన్నాయో తెలుసా నల్లటి ఆకాశం లో చంద మామలా ఉంది అనాలని..కొన్ని ఫేంటసీలు ఉంటాయ్.కానీ చెంపా చెంపా ఆనించుకుని వాన చూద్దామని తెల్లవారు ఝాము లేపాబోతే "హేవిటల్డీ నిద్దరొస్తోందల్డీ"అని ఆఆవలిస్తుంది.మన వాడి మూడ్ అవుట్.ఇంక మల్లెపూల డైలాగ్ చెబుదామంటే "సీతా నీ నల్లని సవరంలో..."అని సవరించాల్సి వస్తుందని ఆ ప్రయత్నం కూడా విరమించుకుంటాడు.పైగా తన ఫాంటసీలకు అడ్డు పడడానికి సరిగ్గా భోంచేసి సీత దగ్గరకి వెళ్లబోతుంటే సైంధవుడిలా "అమెరికా వాడు పాపం ఆ కువైట్ మీద పడ్డాడేంటి.?"అని మొదలెట్టి అంతర్జాతీయ రాజకీయాలకూ తమ ఊరి పంచాయితీ గొడవలకీ దిక్కుమాలిన పోలికలు చెప్తూ హింసించే మామ గారు(అత్తారింట్లో ఉండగా లెండి).ఇలాంటివే కొన్ని సున్నితమైన హాస్య గుళికలు..అన్నింటికన్నా పాత హిందీ రొమాంటిక్ సాంగ్సూ,మల్లెల వాసన,వెన్నెల వాసన...చుట్టుముట్టేస్తాయి మనల్ని.
అందుకని చెప్పొచ్చేదేంటంటే కథలంటే అవేవో కొన్ని నీతులు చెప్తూ మొత్తం సమాజాన్ని మార్చిపారెయ్యాల్సిందే అని కంకణం కట్టేసుకున్నారేమో అనిపిస్తోంది ఈ మధ్య కథలు చదివితే. ఇలాంటి కథలు కూడా రాయొచ్చు కదా.