Your Ad Here
Showing posts with label సాహిత్యం. Show all posts
Showing posts with label సాహిత్యం. Show all posts

వేటూరి పాటే మంత్రము


వేటూరి అన్న మూడక్షరాల్లో ఓ సముద్రమంత వైవిధ్యం ఉంది.నిజానికి ఆ సముద్రంలో తెలుగు సినిమా పాట అన్న ముంతకు దక్కింది ముంతడు నీళ్లే.ఐనా,ఆ ముంతడు నీళ్లే మన మరుగుజ్జు మేధ పాలిటి చతుస్సాగర పర్యంతం ఐపోయింది.శంకరాభరణం లాంటి క్లాసిక్కూ,అడవి రాముడు లాంటి కసక్కూఒ ఒకేసారి రుచి చూసి అదే గొప్ప వైవిధ్యమనుకుంది వెండితెర.కానీ,ఆయన కవితావిశ్వరూపం వెండితెర గుక్కతిప్పుకోలేనంతటిదని అంటూంటారు ఆయన్ని బాగా తెలిసినవాళ్లు.

పోనీ వేటూరి వెండితెర యాత్రనే తీసుకున్నా తలవని తలపుగా "ఓ సీత కథ"లో అవకాశం వచ్చిన నాటి నుంచి మరణానికి కొన్ని వారాల ముందు "విలన్" వరకూ రాస్తూనే ఉన్నారు.సినీ గీతాల్లో ఇటు టేస్టుగా అమృతాన్ని అటు నిష్ఠగా మద్యాన్నీ కూడా అందించారు.అంతకంత ప్రతిష్ఠ అప్రతిష్ఠలు మూటకట్టుకున్నరు.

హనుమంతుడంత వారితో కుప్పిగంతులు వేయించి వెక్కిరించే అవగుణాలు కాసేపు పక్కన పెట్టి,ఆయన నోటి తుంపరలు లెక్కపెట్టకుండా ఆ కవితాగానాన్ని విందాం.

వేటూరి ప్రత్యేకతలు పదాలతో ఆట..లోతైన భావం...చిక్కని భాష

పదాలతో ఆట ముఖ్యంగా సన్నివేశ బలం,సందర్భ ఔచిత్యం లేని పాటల కోసం మొదలెట్టాననీ,తర్వాత తర్వాత బలమైన సన్నివేశాలను ప్రతిష్ఠించాల్సిన ఆలయంలా మాత్రమే పదాలను వాడాననీ...ఎన్నడూ పదాలకు పట్టం కట్టలేదని చెప్తారు వేటూరి. తెలుగు పదానికి చక్కిలిగింతలు పెట్టి పకపకా నవ్విస్తారు..ఆ పదాలతో పాటకు కన్నుకొట్టిస్తారు..మన నాలుకలపై నాట్యం ఆడిస్తారు.

"రాంబంటు"లో హీరో అమాయకత్వం గురించి రాస్తూ "సిగలోకి పూలంటే అరటిపువ్వు తెస్తాడు" అని ఊరుకోకుండా "అవకతవకడు","ముదురుబెండడు" లాంటి ముచ్చటైన ప్రయోగాలు చేసి ముళ్లపూడి వారికి ముద్దొచ్చేసారట వేటూరి.డబ్బింగ్ గీతాలు మారం చేస్తుంటే "అరబిక్ కడలందం" లాంటి పదాలు పుట్టించేసారు."తానానా తాన తానానన ఇది పల్లవి ఒక తింగరోడి గురించి రాయండి గురువుగారు" అని మాధవపెద్ది సురేష్ ట్యూనూ టైమూ ఇస్తే..ఆశుకవి ఆ సుకవి అరక్షణం ఆగకుండా "ఏముంది ఏ బీ సీ రాని ఏబ్రాసి"అన్నార్ట మరి,"తర్వాతి లైనో" అని నసిగితే.."ఒకటి ఇంగ్లీష్ అయ్యింది కదా ఇప్పుడు తెలుగు రాస్కో ఓ అంటే ఢం రాని సన్నాసి",అనేసార్ట.ఆ పాట పల్లవి ఇలా వచ్చింది..

"ఏ బీ సీ రాని ఏబ్రాసిరో వాడు ఓ అంటే ఢం రాని సన్నాసిరో"

అదీ వేటూరి వేగం పద చమత్కారం.

దర్శకుడు స్వేచ్ఛ ఇచ్చిన చోట "అచ్చెరువున అచ్చెరువున(ఆ+చెరువున)"..."ఆబాలగోపాలము ఆ బాలగోపాలుని" అంటూ పూర్వకవుల పంథాలో అలంకారాల(యమకం అని గుర్తు)తో చెలరేగాడు."అడవిరాముడు"లాంటి మాస్ సినిమాలో జనానికి తెలియకుండా

"ఆరేసుకోబోయి పారేసుకున్నాను

కోకెత్తుకెళ్లింది కొండగాలి"

అంటూ అచ్చమైన పదహారణాల సీసపద్యం రాసి మెప్పించనూ గలడు(గణాలూ యతులూ కూడా కించిత్ తప్పలేదు) "గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన

గోధూళి ఎర్రన ఎందు వలన" కూడా సీసమే(రెండవ పాదంలో యతి సరిపోయిందో లేదో ఒకసారి చూడండి) "ఆనంద్"లో "నువ్వేనా నా నువ్వేనా"పాట పాడిన కె.ఎం.రాధాకృష్ణ గొంతులో ఒక గస ఉంటుంది..మాంత్రికుడు వేటూరి సరిగ్గా ఆయన గొంతుతోనే "గసగసాల కౌగలింత గుసగుసల్లె మారుతావు" అని పాడించారు .పైగా గసగసాల కౌగలింత అన్న ప్రయోగం....గసగసాల-గుసగుసల్లే శబ్దాలంకారం నిజంగా అద్భుతం.

ఇక"మమ్మీ పోయి డాడీ వచ్చే" (మిష్టర్ పెళ్లాం) మరో గిలిగింత.

"అంట్లు తోమే ఆడది జంట్స్ కు లోకువ చూడు గాజులు తొడిగే శ్రీమతి ఫోజులు చెల్లవు నేడు" వంటివి మధ్యలో "టింగనాలు" లాంటివి వెయ్యడం.మొత్తానికి ఆ పాట చమత్కారప్రియులకు విందుభోజనం.

ఇంక ఆయనలో మరో కోణం భావ గాంభీర్యం.నిజమైన కవిత్వం రాయాలంటే ఓ జీవితకాలం తపస్సు చెసి పుట్టాలి.అదే కవిత్వం అర్ధం చేసుకోవాలంటే పది జన్మలు తపస్సు చేసి పుట్టాలంటారు.ఆయన భావాల్లో లోతు చూడాలంటే ఈ చిన్ని ప్రయత్నం చాలదు.కానీ నాకు తెలిసినదాన్ని పంచుకోవడంలో తప్పు లేదుగా.

"సూర్యుడైనా

చలవ చంద్రుడైనా

నింగి చుక్కలైనా

అష్ట దిక్కులైనా

నువ్వైనా నేనైనా

నీవైనా అహ నావైనా

సంద్రాన మీనాల చందమే" అని రాశారొక పాటకు సాకీగా.ఏదైనా సరే సముద్రంలో ప్రతిబింబంగా పడినప్పుడు చేపల్లా చలించాల్సిందేనని భావం.సముద్రం ఎవరినైనా తన బిడ్డలైన చేపపిల్లల్లానే చూస్తుందని ఆ సంద్రం పెంపుడు బిడ్డలైన జాలరులు పాడుకోవడం అబ్బబ్బా మహప్రభో మహత్తరం.

"తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా ...కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా" అన్న వాక్యం కులం మూలాల్ని ఎలా ప్రశ్నిస్తోందో చూడండి.

వేటూరి ఊహల్ని మనముందు బొమ్మలా కళ్లకు కడతారు.అలవోకగా రాసే క్రమంలో స్థల కాలాల్ని నిర్దేశించి వదులుతారు. ఒక రాత్రి ప్రేయసీ ప్రియులు కారులో షికారుకెళ్లే సందర్భం వస్తే బుర్రబద్ధలు కొట్టుకోరు.

"యమునా తీరం....సంధ్యా రాగం నిజమైనాయి కలలు ఈలా రెండు కనులలో" అని ఊరుకుంటారు నిజానికి అది యమునా తీరం కాకున్నా..అప్పుడు సంధ్యా సమయం కాకున్నా.

"నందికొండ వాగుల్లో నల్లతుమ్మ నీడల్లో చంద్ర వంక కోనల్లో సందెపొద్దు చీకట్లో" అంటూ భయాన్ని కళ్లముందుకు తెస్తారు. "మాటే మంత్రం" అన్నారు కానీ వేటూరి పాటే మంత్రం అని అర్ధమయ్యింది మనకు.

"వేణువై వచ్చాను భువనానికి...గాలినై పోతాను గగనానికి" అంది ఆయన పాళీ.మనం ఇంత శరీరం(వేణువు)తో ఈ భూమ్మీదకు వచ్చామనీ..ప్రాణం(గాలి)గా నింగికి పోతామని అర్ధం.మధ్యలో ఈ జీవితం వేణుగానం.అలాగే ఈ నాడు వేటూరి అనే వేణువు లేదు..ఆ వేణువులో గాలీ లేదు.ఆ వేణుగానం మాత్రం ప్రతీ తెలుగు గొంతులో ప్రతిధ్వనిస్తుంది.

పుట్టిన ప్రతివాడికీ ఋషి ఋణం ఉందంటారు పెద్దలు.పాడుకున్న ప్రతీ పాటకూ కవిఋణం ఉంటుంది.ఈ టపా ద్వారా నేను కొంతైనా తీర్చుకోదలిచాను.మీ వంతుగా మీరూ ఆయన పాటల్ని వాటిలో మీకు కనిపించిన ప్రత్యేకతల్నీ కామెంట్లుగా రాయండి.ఆ మహానుభావుకుడు పరమేశ్వరునిలో ఐక్యం పొందాలని ఆశిస్తున్నాను.

"సిరా"వెన్నెల సీతారామ శాస్త్రి

తెలుగు సినీ గీతానికి అసుర సంధ్య అనదగ్గ సమయంలో ఉదయించి సిరివెన్నెల కురిపించిన చందమామ ఆయన.పైకి అందరికీ తేలికగా అర్ధమౌతూనే ఎంతో నిగూఢమైన భావ గాంభీర్యాన్ని కలిగిన కలం ఆయనది.ఆయనే సిరివెన్నెల సినిమాతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా మారిన చేంబోలు సీతారామ శాస్త్రి."అడవిగాచిన వెన్నెల" అన్న సామెతని చమత్కారంగా "వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా"అంటూ మార్చిన చమత్కారం..ఆయన సొంతం."పడమర పడగలపై వెలిగే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరీ తూరుపు వేదికపై వేకువ నర్తకివై రాత్రిని వెలిగించే కాంతులు చిందనీ"అనే భావ గాంభీర్యం ఆయన వరం.కె.విశ్వనాథ్ వల్ల వెలుగులో కి వచ్చిన చేంబోలు సీతారామ శాస్త్రి "సిరివెన్నెల" సినిమాలో అన్ని పాటలు ఘన విజయాలు సాధించడం వల్ల తేలికగా సినీ రంగం లొ స్థిరపడ్డారు అనుకుంటాము సాధారణం గా.కానీ సిరివెన్నెల తరువాత వచ్చిన అవకాశాలను ఆయన ఉపయోగించుకో లేకపోయారట.అప్పట్లో ఆయన ఇలాంటి పాటలే హిట్టవుతాయనుకునే దర్శకుల వల్లా,అక్కడకక్కడే రాయమనే నిర్మాతల వల్లా చాలా ఇబ్బంది పడ్డారుట.మెల్లిగా ఈయన సిరివెన్నెల లాంటి వాటికి తప్ప కమర్షియల్ సినిమాలకు పనికి రాడనే పేరు వచ్చేస్తోంది.సరిగా అప్పుడే దర్శకుడు వంశీ సిరివెన్నెలలో కమర్షియల్ గా రాస్తూ కవితాత్మను వదలని లక్షణాన్ని గమనించారు.దాంతో ఆయనకు కమర్షియల్ బాణీ అలవాటుచేశారు వంశీ.అలా వచ్చిందే లేడీస్ టైలర్.ఇక వేటూరిలా అలవోకగా రాయలేని ఇబ్బందిని ఓ చిట్కా కనిపెట్టి పరిష్కరించుకున్నరు.అదే ఈవెనింగ్ సిట్టింగ్స్.సాయంత్రం సందర్భం చెప్పించుకుంటే రాత్రంతా టైం వస్తుందని కనిపెట్టారాయన. అలా సీతారామ శాస్త్రి హిట్టయ్యారు.ఇదంతా వదిలి ఆయన పాటల గురించి చెప్పుకుందాం.సీతారామ శాస్త్రి పాటల్లో నేను గమనిచిన ప్రత్యేకత ఏంటంటే..అందరూ ఒప్పుకునే దాన్ని కాక వేరేదాన్ని చెప్తాడు..అరే ఇదేంటి అని ఆశ్చర్యపోయే లోగా మనం కూడా అంగీకరించేంతటి వివరణ ఇస్తారు.దీనికి ఉదాహరణ ఎం.ఎస్.రాజు అనుభవాల్లోంచి చెప్పొచ్చు.మొదట్లో ఎం.ఎస్.రాజుకు సీతారామశాస్త్రి పట్ల మంచి అభిప్రాయం ఉండేది కాదు.కానీ "ఒక్కడు" మొదటి పాట ఎవరూ రాయలేకపోతే తప్పక సీతారామ శాస్త్రిని సంప్రదించారాయన.శాస్త్రి గారు తర్వాతి ఉదయం ఎం.ఎస్.రాజు గారికి పాట పల్లవి వినిపించడం మొదలుపెట్టారు."రాముణ్నైనా కృష్ణుణ్నైనా కీర్తిస్తూ కుర్చుంటామా"అన్నారు శాస్త్రి గారు."కాకపోతే ఏం చేస్తాం"అని ఆశ్చర్యపోయారు రాజు మొదటిలైనే యాంటీ సెంటిమెంటా అని.."వాళ్లేం సాధించారో కొంచం గుర్తిదాం మిత్రమా...సంద్రం కూడా స్తంభించేలా మనసత్తా చూపిద్దామా(రాముడు) సంగ్రామం లో గీతాపాఠం తెలుపమా(కృష్ణుడు)"అని పూర్తి చేసేసరికీ ఎం.ఎస్.రాజు అనుమానాలు పటాపంచలైనాయట.అప్పట్నించీ ఆయన ఆస్థాన కవి సిరివెన్నెలే.
సినిమాలో ఆయన రాసిన పాటలు ఎలాగూ తెలుస్తాయి కనుక మనకు తెలిసిన సిరివెన్నెలను వదిలి తెలియని సీతారామశాస్త్రి కవితలు కొన్ని చూడండి.
"అమృత మధనం" అనే కవితలో కొన్ని పంక్తులివి
"అసురులైన వారందరు
అనిమేషులైన వారందరును
అమృతత్వమందగా నెంచిరి
యమపాశమను ప్రశ్న మడియించవలెనంచు
జగతి జలధి మథియించిరి"
ఆ జగతి అను జలధి ఎలా ఉందటా
"సత్యమును అగాధమున నిల్పి
సర్వవర్ణములు కలిపి
స్వేతార్ణమను భ్రాంతి గొలిపి
ఆటుపోటుల బ్రతుకు కాచి వడబోసినది
ఆటపాటల లోన పాప వలె తోచినది
జగతియను జలధి"
భారతీయ తత్వం గురించి ఆయన రాసిన గేయం ఇది.
యోగులు సాగిన మార్గమిది
లోకములేలిన దుర్గమిది
శాశ్వత శాంతుల స్వర్గమిది
వేదధ్వజ ఛాయలలో సాగిన భరతావని దిగ్విజయమిదియోగులు
రాతికి రప్పకి చెట్టుకి చేమకి చరాచరమ్ములనన్నిటికి
మత మస్తకములు మతులు సలుపు పరమోన్నతమౌ ఘన సంస్కృతిది యోగులు
వినయము విద్యా భూషణమనుకొను విమల మనస్కుల నేల ఇది
దురహంకారము దరి చేరని మహనీయ జీవనుల మార్గమిది
సరళ జీవనము విరాట్ చింతనము అవిరళ సరళిగనెంచినది
ఆద్యంతములకు అటునిటు నిలచిన ఆనందము పరికించినది 2
గీతా జ్యోతిని ఒసగి చేతముల చేయూతగ నడిపించినది
అజ్ఞానమునకు అందని ద్రష్టను కాంచిన కాంచన దుర్గమిదియోగులు
కాలుడు రేపిన చీకటి ధూళి
రక్కసి మూకల కర్కశ కేళి
విసరిన వికృత విష వలయమ్మున విస్మృతి పొందిన విభవమిది2
పండిన పాపము పిండగ కేశవుడవతరించు సంకేతమిది
హలాహలమ్ములను అరాయించుకును అమృత హృదయుల స్వర్గమిది యోగులు
సీతారామశాస్త్రి గారు సాధారణంగా ఒకే పాటకు ఎన్నో వెర్షన్స్ రాస్తుంటారు.అలా "మనసంతా నువ్వే"లో "ఎవ్వరునెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమా" పాటకు ఆయన రాసుకున్న(సినిమాలో లేని) వెర్షన్ ఇది..
1:ఎన్నెనెన్నెన్నో రంగులతో కనిపిస్తుంది ఈ ప్రేమా
రంగులకలలే కాంతి అని నమ్మిస్తుంది ఈ ప్రేమా
వర్ణాలన్నీ కలిసుండే రవికిరణంకాదీ ప్రేమా
తెల్లని సత్యం తానంటూ ప్రకటిస్తుంది ఈ ప్రేమా
2లైలా మజ్ఞూ గాధలనే చదివిస్తుందీ ఈ ప్రేమా

తాజ్మహల్ తన కోట అని ప్రకటిస్తుందీ ఈ ప్రేమా
కలవని జంటల మంటలలో కనిపిస్తుందీ ఈ ప్రేమా
కలిసిన వెంటనె ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమా
3అమృత కలశం తానంటూ ఊరిస్తుందీ ఈ ప్రేమా

జరిగే మధనం ఎంతటిదో ముందుగ తెలపదు ఈ ప్రేమా
ఔనంటూ కాదంటూనే మదిని మధించే ఈ ప్రేమా

హాలాహలముకు నిలవండి చూద్దమంటుందీ ప్రేమా
3ఇంతకుముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమా
ప్రతి ఒక జంటతొ ఈ గాధే మొదలెడుతుందీ ఈ ప్రేమా
సీతారాములనేమార్చే మాయలేడి కద ఈ ప్రేమా
ఓటమినే గెలుపనిపించే మాయాజ్యూదం ఈ
ప్రేమా
చివరగా మా గురువుగారు ఒకాయన సీతారామశాస్త్రి గారి గురించి ఒక కవిత రాసారు.ఆ కవితకు విస్మయం పొందిన శాస్త్రి గారి జవాబు కవిత ఇది.
"నీ కరుణా కటాక్ష వరమో
క్రోధారుణ దృగ్వీక్షణమో

నీ కవితకు నేను అభిషక్తుడనో
శబ్దాటవిన అభిశక్తుడనో
గీర్వాణీ నా జననీ ఏలా శోధించెదవు"

కవిత రాసినది ఒక మనిషి కాదని అతనిలోని సరస్వతి అని భావించి.ఇది వరమా శాపమా అని ప్రశ్నించుకుంటున్నారు కవితాత్మకంగా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తెలుగు చిత్రసీమకు అష్టనందులతో అపర పరమేశ్వరుడిలా అదిలిస్తూ..నూరేళ్లూ చల్లగా బ్రతకాలని ఆయన పుట్టిన రోజు సందర్భంగా కోరుకుంటున్నాను.

కను రెప్పలపై ముద్దాడే కథలు అవి


కొన్ని కథలు ముద్దు పెట్టుకున్నాయండీ నన్ను..నిద్దట్లో ముద్దు పెట్టుకోకూడదు అన్నా వినకుండా పాపాయిని ముద్దు పెట్టుకుంటామే అలాగ.తిలక్ అన్నట్టు పండిన మొగలిపొత్తి మొదలులా వాసన కొడ్తాయి.వంశీ రాసినట్టు చలికాలంలో దుప్పటి సందుల్లోంచి దూరి కితకితలు పెట్టే గోదారి గాలిలా పులకలు రేపుతాయి.సత్యం శంకరమంచి అన్నట్టుగా గాలికీ వెన్నెలకీ కూడా వాటి వాసన వచ్చి గుబాళిస్తాయి.అలాంటి కథలు ఉంటాయా అంటే ఉంటాయి.
కథలు భలే ఉంటాయి మొత్తంగా మనల్ని చుట్టు ముట్టేస్తాయి.కళ్ళకు కట్టినట్టు అన్న మాటని వెక్కిరిస్తూ అవి వినిపిస్తాయి గుబాళిస్తాయి నిమురుతాయి చదువుతున్నంతసేపే కాదు అయ్యిపోయాకా కూడా.
మధ్యన ఉపన్యాసంగా చెప్పవలసినవి కథలుగా రాసి సంభాషణల్లో చెప్పే టైపు కథలు వేస్తున్నారు గానీ నాలుగేళ్ళ క్రితం వరకూ ఈనాడు ఆదివారంలో కథలు బావుండేవి.
సేంపిల్ కి పుష్కరాల టైం లో "వెండి పట్టీలు"అని ఒక కథ వచ్చింది విషయం ఏంటి అంటే చెప్పడం కష్టం గానీ మన చుట్టూ గోదావరి ఆ యాస ఆప్యాయతలు ఆవకాయ వెన్నపూసా ఇలాంటి దినుసులతో ఒక అందమైన బొమ్మరిల్లు కడ్తుంది ఆ కథ చదివినంత సేపు,పైగా వెండి పట్టీల శబ్దం వింపిస్తూనే ఉంటుంది త్రూ-అవుట్. ఇంకో కథ "మనసులో వాన" ఇదీ పై కథ లాంటిదే మంచి కాఫీ లాంటి కథ(ఫీల్ గుడ్ అన్న మాట).కానీ కొంత సందేశం ఉంటుంది.
రస రాజు గారు రాసిన మరో కథ(పేరు గుర్తు లేదు).అందులో ఒకడు నోటి దురద కొద్దీ ఊరి పెద్ద ఇంట్లో భోజనాలు అయ్యాకా అర్ధాకలి తో పంపేసారని వాగుతాడు.అప్పటి నుండి ఆ ఊరిపెద్ద బావ కం అనుచరుడు నరహరి వాళ్లింట్లో ఏ భోయనాలు ఉన్నా ఆ నోటి దురద కాండిడేట్ ని పిల్చి భోజనం పెట్టీ పెట్టీ చంపేస్తాడు.అసలు నవ్వు ఆపుకోలేక మనం భోజనం చెయ్యలేక వాడు చావాలి పొట్ట చెక్కలై.
ఇంక అప్పుడెప్పుడో చదివిన బాపు గారి "మబ్బూ-వానా-మల్లె వాసనా"కూడా మతి పోగొట్టి మనసుని నింపే కథే.మన హీరోకి తన భార్య చెంప మీద చెంప ఆనించుకుని వాన చూడాలని,మల్లె పూలు పెట్టుకుంటే గాఢంగా వాసన చూసి సీతా నీ జడలో ఈ మల్లేపూలు ఎలా ఉన్నాయో తెలుసా నల్లటి ఆకాశం లో చంద మామలా ఉంది అనాలని..కొన్ని ఫేంటసీలు ఉంటాయ్.కానీ చెంపా చెంపా ఆనించుకుని వాన చూద్దామని తెల్లవారు ఝాము లేపాబోతే "హేవిటల్డీ నిద్దరొస్తోందల్డీ"అని ఆఆవలిస్తుంది.మన వాడి మూడ్ అవుట్.ఇంక మల్లెపూల డైలాగ్ చెబుదామంటే "సీతా నీ నల్లని సవరంలో..."అని సవరించాల్సి వస్తుందని ఆ ప్రయత్నం కూడా విరమించుకుంటాడు.పైగా తన ఫాంటసీలకు అడ్డు పడడానికి సరిగ్గా భోంచేసి సీత దగ్గరకి వెళ్లబోతుంటే సైంధవుడిలా "అమెరికా వాడు పాపం ఆ కువైట్ మీద పడ్డాడేంటి.?"అని మొదలెట్టి అంతర్జాతీయ రాజకీయాలకూ తమ ఊరి పంచాయితీ గొడవలకీ దిక్కుమాలిన పోలికలు చెప్తూ హింసించే మామ గారు(అత్తారింట్లో ఉండగా లెండి).ఇలాంటివే కొన్ని సున్నితమైన హాస్య గుళికలు..అన్నింటికన్నా పాత హిందీ రొమాంటిక్ సాంగ్సూ,మల్లెల వాసన,వెన్నెల వాసన...చుట్టుముట్టేస్తాయి మనల్ని.
అందుకని చెప్పొచ్చేదేంటంటే కథలంటే అవేవో కొన్ని నీతులు చెప్తూ మొత్తం సమాజాన్ని మార్చిపారెయ్యాల్సిందే అని కంకణం కట్టేసుకున్నారేమో అనిపిస్తోంది ఈ మధ్య కథలు చదివితే. ఇలాంటి కథలు కూడా రాయొచ్చు కదా.

యురేకా ఏంట్రా మూర్ఖా

" తీగ పూవునో కొమ్మ తేటినో కలిపింది వింత అనురాగమౌనో"అంటూ చివరికి ప్రేమికులిద్దరూ ఆత్మహత్యచేసుకుని ప్రేమని బతికించిన(?) మరోచరిత్ర గుర్తుందిగా. సినిమా వెనుక విషాదముంది. సినిమా చూసి సరాసరి చెన్నై మెరీనా బీచ్ దగ్గర్లో సూసైడ్ పాయింట్ మీదనుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.దానికిపశ్చాత్తాపపడి ఆత్మహత్యల్ని వ్యతిరేకిస్తూ "అక్టోబర్ 1 "అనే సినిమా తీసాడు.
కానీ చనిపోయిన ప్రేమికుల జంటను వెనక్కి తేగలిగాడా?
*****
"అపరిపక్వమైన భావాలు కలవారు మహా కావ్య రచనకు అనర్హులు" అంటోంది సనాతన భారతీయ దృక్పథం.మహాకావ్య కర్తలు మాత్రమే కాదు సమాజాన్ని ప్రభావితం చెయ్యగల ఆవిష్కర్తలు,సృజన కారులు ఎవరికైనా వర్తించే మహాద్భుత వాక్యమిది.సాధారణంగా విస్తృతమైన సాహిత్య పరిశీలన,చక్కటి వ్యవహార జ్ఞానం పరిపక్వతకు ముఖ్యం.
పై రెంటిలో ఒక్కటి లేకపోయినా అపరిపక్వ భావనలకు ఆస్కారముంది.
పైన చెప్పుకున్న విధంగా పరిణతి చెందని భావనలతో,తన ఆవిష్కరణ లేదా కావ్యం యొక్క ప్రభావం పట్టించుకోకుండా వాటిని ప్రజల్లోకి తెస్తే తప్పుడు భావాల ప్రభావం ఆవిష్కరణ వల్ల ప్రమాదం ప్రజలమీద పడుతుంది. తర్వాత అదే రచయితో,శాస్త్రవేత్తో పరిణతి చెందాకానో,ప్రభావం తెలుసుకున్నాకానో రచనకు పూర్తి వ్యతిరేకమైన కోణంలోకి తన భావధార దారి మళ్లాకా అతని బాధ వర్ణనాతీతం.
చలం తన యౌవనంలో నాస్తికుడిగా ఉన్నప్పుడు ఎన్నో రచనలను కోణంలో చేసాడు.తద్వారా ఎందర్నో ప్రభావితంచేసాడు.తన జీవితపు ఆఖరు పేజీల్లోకి వచ్చేప్పటికి భగవత్ దర్శనం కోసం తపించిన ఆస్తికుడిగా మారిపోయాడు.గిరిప్రదక్షిణం చేస్తున్న రమణ మహర్షి దారికి అడ్డంపడి "స్వామీ మీ కరుణ కావాలి"అని ఆక్రోశించేవాడు(ప్రతీ రోజూ అదేఅడిగేవాడట.ఒక నాడు మహర్షి "అదిదా ఎప్పుడూ ఉండాది"అన్నారట(సూర్యుని వెలుగు సూర్యుడు ఉన్నంత సేపూ ఉంటుంది నువ్వు బిడాయించుకున్న తలుపులు తెరిచి రావాల్సింది నువ్వే కానీ గదిలో కూర్చుని వెలుగు కావాలంటే సూర్యుడు మాత్రం చేసేదేముంది అని తాత్పర్యం అయ్యుంటుంది))
తన మటుకూ తను ఆస్తికుడైపోయాడు(ఆ మాటకొస్తే మహా భక్తుడయ్యాట్ట) చలం.అంతకు ముందు నాస్తికునిగా ఉన్నప్పుడు దృక్పథంలో రచనలు,వాటి వల్ల ప్రభావితమైన వ్యక్తులు,అందుమూలంగాతల్లకిందులైన జీవితాలు వీటికి నైతిక బాధ్యత ఎవరిది?
*****
కవులూ,సినిమా దర్శకులే కాదు ఆధునిక శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యుడని ఎత్తుపీట మీద కూర్చున్న
ఐన్ స్టీన్ అణుబాంబును ఆవిష్కరించగల డిస్కవరీ కనిపెట్టి పర్యవసానాలు ఊహించకుండా వెల్లడించాడు.తర్వాత అర్ధమయ్యాకా ఎంతోబాధ పడ్డాడు."ఇలా జరుగుతుందని ముందే తెలిసి ఉంటే చెప్పులు కట్టుకుని బతికేవాడిని గానీ లాబ్ వంక చూసే వాడిని కూడా కాదు"అన్నాడు సందర్భంలో.
*****
"సముద్రంలో తిమింగలాలు ఎన్ని కలిసినా ఎంత ఎగిరినా ఒక్క అలను కూడా తీరం తాకించలేవు.
అదే కొలనులో ఒక చిన్న రాయితో కొట్టినా అలజడి పుడుతుంది"
అనే భావంతో ఒక సంస్కృత శ్లోకం ఉంది(అది గుర్తు రావట్లేదు ఎవరికైనా తెలిస్తే చెప్పండి).మహనీయుల ఆలోచనల అలజడి వారిలో భావోద్వేగం కలిగించలేదని,మామూలు వారి చిన్న ఆలోచన తునక కూడా ఉద్వేగాలతో వాళ్ళని ఎత్తి కుదేస్తుందనే ఉద్దేశ్యం కలిగిస్తుంది ఆ శ్లోకం.
మన దగ్గరకొచ్చాకా పాయింటేమిటి అంటే యోగంతో శరీరాన్ని లొంగదీసుకున్న సముద్ర సములైన మహనీయులు "టైం ఎంత"అంటే "పావు తక్కువ తొమ్మిది"అన్నంత మామూలుగా చెప్తాడు ఒక మహా సత్యాన్ని.అదే సెల్ఫ్ కంట్రోల్ లేనివాడు చిన్నదో,పెద్దదో ఆలోచన మనస్సున తళుక్కుమని మెరవగానే దాని పర్యవసానాలను ఆలోచించడు. ఉద్వేగంలో "యురేకా"అని గీపెట్టి బట్టల్లేకుండా బాత్ టబ్ లోంచి వీధుల్లోకి పరిగెడతాడు.కొలనులో అలల్లా చాలాసేపు ఊగి ఊగి ఊర్కుంటాడు. ఊపులోమంచి చెడులు ఆలోచించి పరిశోధన ఫలాలు వెల్లడిద్దామన్న వివేకం చస్తుంది.
తన గొప్పదనం పదిమందికీ తెలియాలనే ఉబలాటంలోనో,కాలంపై సంతకం చేస్తున్నాననే ఉద్వేగంలోనో కాక తమ రచనల వల్ల,పరిశోధనల వల్ల పదిమందికీ ఉపయోగపడాలనే పరిణతి కావాలి ద్రష్టలకు,స్రష్టలకూను.
*****
అంతవరకూ ఎందుకు ఏనాడో ఎవడో కాని మోకాల్లోతు నీళ్ళతో నిండిన మచిలీపట్నం బస్టాండ్ చూసి దాన్నిఉపమానంగా వాడి "ఛీ బతుకు బందరు బస్టాండ్ అయిపోయిందిరా"అన్నాట్ట.దెబ్బకి అదో జాతీయమైపోయింది.
మొన్నో బందరాయన మాటకు "ఇప్పుడు బందరు బస్టాండ్ మారిపోయింది. మాట ఎప్పటికి మారుతుందో"అని బాధపడ్డాడు పాపం(బందరు వాళ్ళకి ఊరంటే బాగా ఎక్కువ అభిమానం లెండి).
బందరు
బస్టాండ్ అన్న మాటకీ సిగ్గుతెచ్చుకుని బస్టాండ్ బాగు చేసుకుంటే ఏమో గానీ లేకుంటే అజ్ఞాత కవిని బందరూ,బందరు బస్టాండు క్షమించలేవు.కాదంటారా.