Your Ad Here

"సిరా"వెన్నెల సీతారామ శాస్త్రి

తెలుగు సినీ గీతానికి అసుర సంధ్య అనదగ్గ సమయంలో ఉదయించి సిరివెన్నెల కురిపించిన చందమామ ఆయన.పైకి అందరికీ తేలికగా అర్ధమౌతూనే ఎంతో నిగూఢమైన భావ గాంభీర్యాన్ని కలిగిన కలం ఆయనది.ఆయనే సిరివెన్నెల సినిమాతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా మారిన చేంబోలు సీతారామ శాస్త్రి."అడవిగాచిన వెన్నెల" అన్న సామెతని చమత్కారంగా "వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా"అంటూ మార్చిన చమత్కారం..ఆయన సొంతం."పడమర పడగలపై వెలిగే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరీ తూరుపు వేదికపై వేకువ నర్తకివై రాత్రిని వెలిగించే కాంతులు చిందనీ"అనే భావ గాంభీర్యం ఆయన వరం.కె.విశ్వనాథ్ వల్ల వెలుగులో కి వచ్చిన చేంబోలు సీతారామ శాస్త్రి "సిరివెన్నెల" సినిమాలో అన్ని పాటలు ఘన విజయాలు సాధించడం వల్ల తేలికగా సినీ రంగం లొ స్థిరపడ్డారు అనుకుంటాము సాధారణం గా.కానీ సిరివెన్నెల తరువాత వచ్చిన అవకాశాలను ఆయన ఉపయోగించుకో లేకపోయారట.అప్పట్లో ఆయన ఇలాంటి పాటలే హిట్టవుతాయనుకునే దర్శకుల వల్లా,అక్కడకక్కడే రాయమనే నిర్మాతల వల్లా చాలా ఇబ్బంది పడ్డారుట.మెల్లిగా ఈయన సిరివెన్నెల లాంటి వాటికి తప్ప కమర్షియల్ సినిమాలకు పనికి రాడనే పేరు వచ్చేస్తోంది.సరిగా అప్పుడే దర్శకుడు వంశీ సిరివెన్నెలలో కమర్షియల్ గా రాస్తూ కవితాత్మను వదలని లక్షణాన్ని గమనించారు.దాంతో ఆయనకు కమర్షియల్ బాణీ అలవాటుచేశారు వంశీ.అలా వచ్చిందే లేడీస్ టైలర్.ఇక వేటూరిలా అలవోకగా రాయలేని ఇబ్బందిని ఓ చిట్కా కనిపెట్టి పరిష్కరించుకున్నరు.అదే ఈవెనింగ్ సిట్టింగ్స్.సాయంత్రం సందర్భం చెప్పించుకుంటే రాత్రంతా టైం వస్తుందని కనిపెట్టారాయన. అలా సీతారామ శాస్త్రి హిట్టయ్యారు.ఇదంతా వదిలి ఆయన పాటల గురించి చెప్పుకుందాం.సీతారామ శాస్త్రి పాటల్లో నేను గమనిచిన ప్రత్యేకత ఏంటంటే..అందరూ ఒప్పుకునే దాన్ని కాక వేరేదాన్ని చెప్తాడు..అరే ఇదేంటి అని ఆశ్చర్యపోయే లోగా మనం కూడా అంగీకరించేంతటి వివరణ ఇస్తారు.దీనికి ఉదాహరణ ఎం.ఎస్.రాజు అనుభవాల్లోంచి చెప్పొచ్చు.మొదట్లో ఎం.ఎస్.రాజుకు సీతారామశాస్త్రి పట్ల మంచి అభిప్రాయం ఉండేది కాదు.కానీ "ఒక్కడు" మొదటి పాట ఎవరూ రాయలేకపోతే తప్పక సీతారామ శాస్త్రిని సంప్రదించారాయన.శాస్త్రి గారు తర్వాతి ఉదయం ఎం.ఎస్.రాజు గారికి పాట పల్లవి వినిపించడం మొదలుపెట్టారు."రాముణ్నైనా కృష్ణుణ్నైనా కీర్తిస్తూ కుర్చుంటామా"అన్నారు శాస్త్రి గారు."కాకపోతే ఏం చేస్తాం"అని ఆశ్చర్యపోయారు రాజు మొదటిలైనే యాంటీ సెంటిమెంటా అని.."వాళ్లేం సాధించారో కొంచం గుర్తిదాం మిత్రమా...సంద్రం కూడా స్తంభించేలా మనసత్తా చూపిద్దామా(రాముడు) సంగ్రామం లో గీతాపాఠం తెలుపమా(కృష్ణుడు)"అని పూర్తి చేసేసరికీ ఎం.ఎస్.రాజు అనుమానాలు పటాపంచలైనాయట.అప్పట్నించీ ఆయన ఆస్థాన కవి సిరివెన్నెలే.
సినిమాలో ఆయన రాసిన పాటలు ఎలాగూ తెలుస్తాయి కనుక మనకు తెలిసిన సిరివెన్నెలను వదిలి తెలియని సీతారామశాస్త్రి కవితలు కొన్ని చూడండి.
"అమృత మధనం" అనే కవితలో కొన్ని పంక్తులివి
"అసురులైన వారందరు
అనిమేషులైన వారందరును
అమృతత్వమందగా నెంచిరి
యమపాశమను ప్రశ్న మడియించవలెనంచు
జగతి జలధి మథియించిరి"
ఆ జగతి అను జలధి ఎలా ఉందటా
"సత్యమును అగాధమున నిల్పి
సర్వవర్ణములు కలిపి
స్వేతార్ణమను భ్రాంతి గొలిపి
ఆటుపోటుల బ్రతుకు కాచి వడబోసినది
ఆటపాటల లోన పాప వలె తోచినది
జగతియను జలధి"
భారతీయ తత్వం గురించి ఆయన రాసిన గేయం ఇది.
యోగులు సాగిన మార్గమిది
లోకములేలిన దుర్గమిది
శాశ్వత శాంతుల స్వర్గమిది
వేదధ్వజ ఛాయలలో సాగిన భరతావని దిగ్విజయమిదియోగులు
రాతికి రప్పకి చెట్టుకి చేమకి చరాచరమ్ములనన్నిటికి
మత మస్తకములు మతులు సలుపు పరమోన్నతమౌ ఘన సంస్కృతిది యోగులు
వినయము విద్యా భూషణమనుకొను విమల మనస్కుల నేల ఇది
దురహంకారము దరి చేరని మహనీయ జీవనుల మార్గమిది
సరళ జీవనము విరాట్ చింతనము అవిరళ సరళిగనెంచినది
ఆద్యంతములకు అటునిటు నిలచిన ఆనందము పరికించినది 2
గీతా జ్యోతిని ఒసగి చేతముల చేయూతగ నడిపించినది
అజ్ఞానమునకు అందని ద్రష్టను కాంచిన కాంచన దుర్గమిదియోగులు
కాలుడు రేపిన చీకటి ధూళి
రక్కసి మూకల కర్కశ కేళి
విసరిన వికృత విష వలయమ్మున విస్మృతి పొందిన విభవమిది2
పండిన పాపము పిండగ కేశవుడవతరించు సంకేతమిది
హలాహలమ్ములను అరాయించుకును అమృత హృదయుల స్వర్గమిది యోగులు
సీతారామశాస్త్రి గారు సాధారణంగా ఒకే పాటకు ఎన్నో వెర్షన్స్ రాస్తుంటారు.అలా "మనసంతా నువ్వే"లో "ఎవ్వరునెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమా" పాటకు ఆయన రాసుకున్న(సినిమాలో లేని) వెర్షన్ ఇది..
1:ఎన్నెనెన్నెన్నో రంగులతో కనిపిస్తుంది ఈ ప్రేమా
రంగులకలలే కాంతి అని నమ్మిస్తుంది ఈ ప్రేమా
వర్ణాలన్నీ కలిసుండే రవికిరణంకాదీ ప్రేమా
తెల్లని సత్యం తానంటూ ప్రకటిస్తుంది ఈ ప్రేమా
2లైలా మజ్ఞూ గాధలనే చదివిస్తుందీ ఈ ప్రేమా

తాజ్మహల్ తన కోట అని ప్రకటిస్తుందీ ఈ ప్రేమా
కలవని జంటల మంటలలో కనిపిస్తుందీ ఈ ప్రేమా
కలిసిన వెంటనె ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమా
3అమృత కలశం తానంటూ ఊరిస్తుందీ ఈ ప్రేమా

జరిగే మధనం ఎంతటిదో ముందుగ తెలపదు ఈ ప్రేమా
ఔనంటూ కాదంటూనే మదిని మధించే ఈ ప్రేమా

హాలాహలముకు నిలవండి చూద్దమంటుందీ ప్రేమా
3ఇంతకుముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమా
ప్రతి ఒక జంటతొ ఈ గాధే మొదలెడుతుందీ ఈ ప్రేమా
సీతారాములనేమార్చే మాయలేడి కద ఈ ప్రేమా
ఓటమినే గెలుపనిపించే మాయాజ్యూదం ఈ
ప్రేమా
చివరగా మా గురువుగారు ఒకాయన సీతారామశాస్త్రి గారి గురించి ఒక కవిత రాసారు.ఆ కవితకు విస్మయం పొందిన శాస్త్రి గారి జవాబు కవిత ఇది.
"నీ కరుణా కటాక్ష వరమో
క్రోధారుణ దృగ్వీక్షణమో

నీ కవితకు నేను అభిషక్తుడనో
శబ్దాటవిన అభిశక్తుడనో
గీర్వాణీ నా జననీ ఏలా శోధించెదవు"

కవిత రాసినది ఒక మనిషి కాదని అతనిలోని సరస్వతి అని భావించి.ఇది వరమా శాపమా అని ప్రశ్నించుకుంటున్నారు కవితాత్మకంగా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తెలుగు చిత్రసీమకు అష్టనందులతో అపర పరమేశ్వరుడిలా అదిలిస్తూ..నూరేళ్లూ చల్లగా బ్రతకాలని ఆయన పుట్టిన రోజు సందర్భంగా కోరుకుంటున్నాను.
6 Responses

  1. కబుర్ల పొట్లం చాలా బాగుందండీ. ఆపకుండా కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. మీకు సాహిత్యం లో చక్కటి పట్టు ఉన్నట్టుంది. నాలాంటి వారికి కాస్త మంచి మంచి విషయాలు చెప్పండి. eagerly waiting for next post in kaburla potlam. and kindly increase the font size.


  2. "తెలుగు సినీ గీతానికి అసుర సంధ్య అనదగ్గ సమయంలో ఉదయించి సిరివెన్నెల కురిపించిన చందమామ ఆయన"
    బాగుంది.


  3. @ప్రణీత స్వాతి గారు
    కబుర్ల పొట్లం రాద్దామనే ఉంది కానీ ఈ మాత్రం ప్రోత్సాహం దొరక్క ఇప్పటివరకూ ఆగాను.ఇక దాన్ని కొనసాగిస్తాను.కానీ మీ చప్పట్లు మాత్రం ఇలాగే నన్ను నడిపించాలి మరి.

    @లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ గారు
    thanq.టపా పూర్తి చేసేసానండీ.

    @మందాకిని గారు
    thanx

    ---సంతోష్ సూరంపూడి


  4. థాంక్సండీ..అడగ్గానే ఫాంట్ సైజు పెంచి చదవడం సులువు చేశారు. ఇక త్వరగా రాయండి మరీ.


  5. SaiRam Says:

    'sandram kooda sthambinchela mana satha choopidhama'
    entha deep meaning undi... ee line vinagane Yudhakandalo mana Ramula varini choosi samudrame bedharadam gurthu vacchi hrudayam pulakisthundi