వేటూరి అన్న మూడక్షరాల్లో ఓ సముద్రమంత వైవిధ్యం ఉంది.నిజానికి ఆ సముద్రంలో తెలుగు సినిమా పాట అన్న ముంతకు దక్కింది ముంతడు నీళ్లే.ఐనా,ఆ ముంతడు నీళ్లే మన మరుగుజ్జు మేధ పాలిటి చతుస్సాగర పర్యంతం ఐపోయింది.శంకరాభరణం లాంటి క్లాసిక్కూ,అడవి రాముడు లాంటి కసక్కూఒ ఒకేసారి రుచి చూసి అదే గొప్ప వైవిధ్యమనుకుంది వెండితెర.కానీ,ఆయన కవితావిశ్వరూపం వెండితెర గుక్కతిప్పుకోలేనంతటిదని అంటూంటారు ఆయన్ని బాగా తెలిసినవాళ్లు.
పోనీ వేటూరి వెండితెర యాత్రనే తీసుకున్నా తలవని తలపుగా "ఓ సీత కథ"లో అవకాశం వచ్చిన నాటి నుంచి మరణానికి కొన్ని వారాల ముందు "విలన్" వరకూ రాస్తూనే ఉన్నారు.సినీ గీతాల్లో ఇటు టేస్టుగా అమృతాన్ని అటు నిష్ఠగా మద్యాన్నీ కూడా అందించారు.అంతకంత ప్రతిష్ఠ అప్రతిష్ఠలు మూటకట్టుకున్నరు.
హనుమంతుడంత వారితో కుప్పిగంతులు వేయించి వెక్కిరించే అవగుణాలు కాసేపు పక్కన పెట్టి,ఆయన నోటి తుంపరలు లెక్కపెట్టకుండా ఆ కవితాగానాన్ని విందాం.
వేటూరి ప్రత్యేకతలు పదాలతో ఆట..లోతైన భావం...చిక్కని భాష
పదాలతో ఆట ముఖ్యంగా సన్నివేశ బలం,సందర్భ ఔచిత్యం లేని పాటల కోసం మొదలెట్టాననీ,తర్వాత తర్వాత బలమైన సన్నివేశాలను ప్రతిష్ఠించాల్సిన ఆలయంలా మాత్రమే పదాలను వాడాననీ...ఎన్నడూ పదాలకు పట్టం కట్టలేదని చెప్తారు వేటూరి. తెలుగు పదానికి చక్కిలిగింతలు పెట్టి పకపకా నవ్విస్తారు..ఆ పదాలతో పాటకు కన్నుకొట్టిస్తారు..మన నాలుకలపై నాట్యం ఆడిస్తారు.
"రాంబంటు"లో హీరో అమాయకత్వం గురించి రాస్తూ "సిగలోకి పూలంటే అరటిపువ్వు తెస్తాడు" అని ఊరుకోకుండా "అవకతవకడు","ముదురుబెండడు" లాంటి ముచ్చటైన ప్రయోగాలు చేసి ముళ్లపూడి వారికి ముద్దొచ్చేసారట వేటూరి.డబ్బింగ్ గీతాలు మారం చేస్తుంటే "అరబిక్ కడలందం" లాంటి పదాలు పుట్టించేసారు."తానానా తాన తానానన ఇది పల్లవి ఒక తింగరోడి గురించి రాయండి గురువుగారు" అని మాధవపెద్ది సురేష్ ట్యూనూ టైమూ ఇస్తే..ఆశుకవి ఆ సుకవి అరక్షణం ఆగకుండా "ఏముంది ఏ బీ సీ రాని ఏబ్రాసి"అన్నార్ట మరి,"తర్వాతి లైనో" అని నసిగితే.."ఒకటి ఇంగ్లీష్ అయ్యింది కదా ఇప్పుడు తెలుగు రాస్కో ఓ అంటే ఢం రాని సన్నాసి",అనేసార్ట.ఆ పాట పల్లవి ఇలా వచ్చింది..
"ఏ బీ సీ రాని ఏబ్రాసిరో వాడు ఓ అంటే ఢం రాని సన్నాసిరో"
అదీ వేటూరి వేగం పద చమత్కారం.
దర్శకుడు స్వేచ్ఛ ఇచ్చిన చోట "అచ్చెరువున అచ్చెరువున(ఆ+చెరువున)"..."ఆబాలగోపాలము ఆ బాలగోపాలుని" అంటూ పూర్వకవుల పంథాలో అలంకారాల(యమకం అని గుర్తు)తో చెలరేగాడు."అడవిరాముడు"లాంటి మాస్ సినిమాలో జనానికి తెలియకుండా
"ఆరేసుకోబోయి పారేసుకున్నాను
కోకెత్తుకెళ్లింది కొండగాలి"
అంటూ అచ్చమైన పదహారణాల సీసపద్యం రాసి మెప్పించనూ గలడు(గణాలూ యతులూ కూడా కించిత్ తప్పలేదు) "గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన
గోధూళి ఎర్రన ఎందు వలన" కూడా సీసమే(రెండవ పాదంలో యతి సరిపోయిందో లేదో ఒకసారి చూడండి) "ఆనంద్"లో "నువ్వేనా నా నువ్వేనా"పాట పాడిన కె.ఎం.రాధాకృష్ణ గొంతులో ఒక గస ఉంటుంది..మాంత్రికుడు వేటూరి సరిగ్గా ఆయన గొంతుతోనే "గసగసాల కౌగలింత గుసగుసల్లె మారుతావు" అని పాడించారు .పైగా గసగసాల కౌగలింత అన్న ప్రయోగం....గసగసాల-గుసగుసల్లే శబ్దాలంకారం నిజంగా అద్భుతం.
ఇక"మమ్మీ పోయి డాడీ వచ్చే" (మిష్టర్ పెళ్లాం) మరో గిలిగింత.
"అంట్లు తోమే ఆడది జంట్స్ కు లోకువ చూడు గాజులు తొడిగే శ్రీమతి ఫోజులు చెల్లవు నేడు" వంటివి మధ్యలో "టింగనాలు" లాంటివి వెయ్యడం.మొత్తానికి ఆ పాట చమత్కారప్రియులకు విందుభోజనం.
ఇంక ఆయనలో మరో కోణం భావ గాంభీర్యం.నిజమైన కవిత్వం రాయాలంటే ఓ జీవితకాలం తపస్సు చెసి పుట్టాలి.అదే కవిత్వం అర్ధం చేసుకోవాలంటే పది జన్మలు తపస్సు చేసి పుట్టాలంటారు.ఆయన భావాల్లో లోతు చూడాలంటే ఈ చిన్ని ప్రయత్నం చాలదు.కానీ నాకు తెలిసినదాన్ని పంచుకోవడంలో తప్పు లేదుగా.
"సూర్యుడైనా
చలవ చంద్రుడైనా
నింగి చుక్కలైనా
అష్ట దిక్కులైనా
నువ్వైనా నేనైనా
నీవైనా అహ నావైనా
సంద్రాన మీనాల చందమే" అని రాశారొక పాటకు సాకీగా.ఏదైనా సరే సముద్రంలో ప్రతిబింబంగా పడినప్పుడు చేపల్లా చలించాల్సిందేనని భావం.సముద్రం ఎవరినైనా తన బిడ్డలైన చేపపిల్లల్లానే చూస్తుందని ఆ సంద్రం పెంపుడు బిడ్డలైన జాలరులు పాడుకోవడం అబ్బబ్బా మహప్రభో మహత్తరం.
"తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా ...కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా" అన్న వాక్యం కులం మూలాల్ని ఎలా ప్రశ్నిస్తోందో చూడండి.
వేటూరి ఊహల్ని మనముందు బొమ్మలా కళ్లకు కడతారు.అలవోకగా రాసే క్రమంలో స్థల కాలాల్ని నిర్దేశించి వదులుతారు. ఒక రాత్రి ప్రేయసీ ప్రియులు కారులో షికారుకెళ్లే సందర్భం వస్తే బుర్రబద్ధలు కొట్టుకోరు.
"యమునా తీరం....సంధ్యా రాగం నిజమైనాయి కలలు ఈలా రెండు కనులలో" అని ఊరుకుంటారు నిజానికి అది యమునా తీరం కాకున్నా..అప్పుడు సంధ్యా సమయం కాకున్నా.
"నందికొండ వాగుల్లో నల్లతుమ్మ నీడల్లో చంద్ర వంక కోనల్లో సందెపొద్దు చీకట్లో" అంటూ భయాన్ని కళ్లముందుకు తెస్తారు. "మాటే మంత్రం" అన్నారు కానీ వేటూరి పాటే మంత్రం అని అర్ధమయ్యింది మనకు.
"వేణువై వచ్చాను భువనానికి...గాలినై పోతాను గగనానికి" అంది ఆయన పాళీ.మనం ఇంత శరీరం(వేణువు)తో ఈ భూమ్మీదకు వచ్చామనీ..ప్రాణం(గాలి)గా నింగికి పోతామని అర్ధం.మధ్యలో ఈ జీవితం వేణుగానం.అలాగే ఈ నాడు వేటూరి అనే వేణువు లేదు..ఆ వేణువులో గాలీ లేదు.ఆ వేణుగానం మాత్రం ప్రతీ తెలుగు గొంతులో ప్రతిధ్వనిస్తుంది.
పుట్టిన ప్రతివాడికీ ఋషి ఋణం ఉందంటారు పెద్దలు.పాడుకున్న ప్రతీ పాటకూ కవిఋణం ఉంటుంది.ఈ టపా ద్వారా నేను కొంతైనా తీర్చుకోదలిచాను.మీ వంతుగా మీరూ ఆయన పాటల్ని వాటిలో మీకు కనిపించిన ప్రత్యేకతల్నీ కామెంట్లుగా రాయండి.ఆ మహానుభావుకుడు పరమేశ్వరునిలో ఐక్యం పొందాలని ఆశిస్తున్నాను.
"ఎదలోని సొదలా ఎలదేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా"
"తుమ్మెదతో తారాటలా తెమ్మెరతో సయ్యాటలా
వన్నేలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది నిన్నటి పువ్వు"
వేటూరికి అశ్రు నివాళి.
"ఉచ్వాస నిశ్వాసములు వాయులీనాలు..స్పందించు నవ నాడులే వీణా గానాలు..." శంకరాభరణం లో చివరి పాట. నాకు చాలా ఇష్టమైన పాట. వేటూరిగారి కలం, వాణీ జయరాం గారి గళం నించి జాలువారిన అమృతం.
సంతోష్ గారూ...చిన్న సందేహం..తీరుస్తారా? మీరేం చదువుకున్నారు(చదువుతున్నారు)..? అభ్యంతరమైతే వద్దు. కానీ తెలుగు భాష మీద మీ కమాండ్..చూసి అడగాలనిపించింది.
మీ వివరణ చాలా బాగుందండి. వేటూరిగారి కవిత్వంలోని ఎన్నో చక్కని అంశాలను వర్ణించారు.
హనుమంతుడి స్వామి అయిన శ్రీరాముడు చెప్పిన, "మరణంతో వైరం, ద్వేషం పోవాలి" అన్న సూక్తి గుర్తుచేసుకుని, వేటూరి చేసిన పొరబాట్లని ఇంకనైన పక్కన పెట్టి, ఆయన అందించిన సాహితీసుధను సామాన్యులకు పంచే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని విమర్శకులకు నా విన్నపం.
నిన్న సందర్భం కాదేమోనని ఊరుకున్నానండి. కాని చెప్పకపోవడం కూడా భావ్యం కాదేమో. మీ టపా చాలా బాగుంది. చాలా బాగా రాశారు.
- 1వ అనానిమస్
chala baga collcet chesaramDi, nijam ga okkasari anna aayana padalanu taakalanipistumdi.
శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా....
పుచ్చా పూవుల విచ్చే తావుల వెచ్చావెన్నెలలు....
వేటూరికి అశృనివాళి!!!
1వ అనామకుల వారికి,
కృతఙ్ఞతలు.ముఖ్యంగా మీరు గుర్తుచేసిన కవితాపాదాలు అద్భుతం.
"తుమ్మెదతో తారాటలా తెమ్మెరతో సయ్యాటలా
వన్నేలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది నిన్నటి పువ్వు"
అన్న పంక్తులు ఎందులోవి కాస్త ఎవరికైనా తెలిస్తే చెప్తారా
2వ అనామకుల వారికి,
మీరు చెప్పింది నిజమే"అందునా ధూర్జటి అంతటివాడే "రాజుల్మత్తులు.." అనే పద్యం లో రాజులకు పద్యాలిచ్చి తెచ్చుకున్న ధనాదులు "ఆత్మవ్యథా బీజాలు" అని అంటే ఆ డబ్బుకు ఆత్మవ్యధ మొలకెత్తుతుందని.ఈ రోజు సినిమా దొరలూ నాటి రాజుల్లాంటి వారే సినీ కవులందరికీ ఆ ఆత్మ వ్యధ తప్పదు.,పైగా వేటూరి పెద్దరికంతో ఒప్పుకునేవారు "నాయనా భుక్తి కోసం పాటల్ని ఎండు చేపల్లా అమ్ముకుంటున్నాము"అని.మిగిలిన వారందరూ కుర్రతనం కొద్దీ తప్పులు కప్పుకుంటారు.తేడా అంతే.
నీహారిక గారికి,
పుచ్చా పువ్వుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలు.
అద్భుతమండీ.విస్వనాధ వారు ఏదో కావ్యంలో వర్ణిచిన చోటకు వెళ్లగా అక్కడ ఆయన వర్ణన(కిన్నెరసాని అనుకుంటా)కనిపించగా ఆ వెన్నెల్లో ఆయనకు కలిగిన పరవశమే ఆ వాక్యాలు అని వేటూరి గారు చెప్పుకొచ్చార్ట.
హను గారికి,
కృతఙ్ఞతలండీ.తెలుగులో మీ భావాలు చెప్పినందుకు సంతోషం.లేఖిని వాడి తెలుగులో రాస్తే మరింత సంతోషం.
--సంతోష్ సూరంపూడి.
ప్రణీత స్వాతి గారికి,
మీ ప్రోత్సాహానికి ప్రత్యేక కృతఙ్ఞతలు.అభ్యంతరాలేవీ లేవుగానీ నేను అకడమిక్ గా తెలుగు చదవట్లేదండీ.బీ.ఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసానిప్పుడే.10 తర్వాత తెలుగు అకడమిక్ గా చదివింది లేదు.
ఇదంతా మా గురువుల పుణ్యం.చిన్నప్పట్నించీ చందమామ చదువుతూ బాలల బొమ్మల పుస్తకాల్లోంచి తెలుగు సాహిత్యం లో పడ్డాను.చదువుకి సంబంధం లేకుండా మా నాన్నారు 15 ఏళ్లకే కళా వారనే గురువు దగ్గర తెలుగు చందస్సులో ఓనమాలు దిద్దించారు.ఆ మహానుభావుడు మొదలు పెట్టడంతోనే నాతో కందం అల్లించారు.ఆపైన కష్టపడి వల్లూరి హనుమంతరావు గారనే మహానుభావుడి సాన్నిహిత్యం సంపాదించుకున్నాను.ఆయనకు 10రోజులకు ఒకసారి నాతో మాట్లాడడం కుదురుతుంది.ఆరోజు 5-6గంటలు నాతో మాట్లాడి చాలా విషయాలు చెప్తారు.ఎన్నో కవితలు వినిపిస్తారు.నేను రాసింది వింటారు.నాదగ్గరున్న మంచి పుస్తకాలు కొన్ని ఆయనకిస్తుంటాను.ఆయన దగ్గర ఎన్నో పుస్తకాలు అరువు తెచ్చుకుంటాను.ఆపై ఏం పుస్తకాలు బావుంటాయో చెప్తారు అవి కొంటూంటా.
ఈ సంభారలకు ఖర్చులకు ఆదివారాలు బి.ఏ ఎం.ఏ డిస్టెన్స్ స్టూడెంట్స్ కి తెలుగు క్లాసులు చెప్పి సంపాదించుకుంటా.
దీంట్లో నా ప్రఙ్ఞ ఏమీ లేదు.అంతా గురువుల దయ.కవిత్వమంటారా దాని గురించి రాసుకున్న లైన్లు ఉన్నయి
"చిత్తం చెప్పినదానికి చిత్తుప్రతులు తప్ప నే రాసినదేమున్నది నీ బిరుదులకొప్ప"
(ఇంత సొంతడబ్బాకు ఎవరైనా చిరాకు పడితే వారికి క్షమాపణలతో...)
--సంతోష్ సూరంపూడి.
ముందుగా మీ గురువుగారికి, మీ తండ్రిగారికి నమస్కారములు. మీకు అభినందనలు.
తుమ్మెదతో తారాటలా, తెమ్మెరతో సయ్యాటలా
తారాటలా సయ్యాటలా, సయ్యాటలా తారాటలా
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది నిన్నటి పువ్వు
బింకాలు బిడియాలు, పొంకాలు పోడుములు
ఏమో ఏమగునో కానీ ఈ సిరి, సొగసరి!
పల్లవి|| మావిచిగురు తినగానే... కోయిల కూసేనా
కోయిల గొంతు వినగానే, మావి చిగురు తొడిగేనా?
మీరు రాసింది చూడగానే టకటకా రాసేస్తున్నా కానీ, ఏ సినిమా లోనిదో తెలీదు మరి.
సంతోష్ గారు, మందాకిని గారు సీతామహలక్ష్మి సినిమాలోనిదండి ఆ పాట. సంతోష్, మీ తెలుగు అభ్యాసం గురించి చదివి చాలా సంతోషమనిపించింది. నా కన్నా చిన్నవారు మీరు. శుభాశీస్సులు.
-1వ అనానిమస్
పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి) గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
సంతోష్ గారూ ముందుగా మీ నాన్నగారికీ, గురువుగార్లకీ నమస్సులు. తెలుగు భాష లోని కమ్మదనాన్ని, తెలుగు సాహిత్యం లోని గొప్పదనాన్ని మాకందరికీ రుచి చూపించమని నా మనవి. కబుర్ల పొట్లం లో కొత్త టపా కోసం ఎదురు చూస్తూ ఉన్నానండీ..
ఏమై పోయారండీ.. చక్కటి టపా కోసం నిరీక్షిస్తూ వున్నాం. త్వరగా రాసేద్దురూ..ఇందులో ఒకటి, తెలుగూ లో ఒకటి.
శుభ సంకల్పం లో హైలెస్సో పాట సిరివెన్నెల రాశారు.
intha kaala ee blog ni ela miss ayyanu
ee blog innallu ela miss ayyanu
'sandarana meenala sandrame' anna padukovadame thappa meaning intha varaku alochinchaledu
telugu abhimanulanu choosinanduku santoshamga undi
మనమెంత రాసినా చంద్రుడికో నూలుపోగు చందమే!
మనమెంత రాసినా చంద్రుడికో నూలుపోగు చందమే!