Your Ad Here

తెగులు పాటల గోల

ఏ వచ్చి బీ పై వాలె
బీ వచ్చి సీ పై వాలె
సీ వచ్చి డీ పై వాలిందే
వన్ వచ్చి టూ పై
వాలె టూ వచ్చి త్రీ పై వాలె
త్రీ వచ్చి ఫోర్ పై
ఏబిసీ అంటే నాలో అందం వన్ టూ త్రీ అంటే నీలో వేగం "

ఏదో ఒక అర్ధం కనీసం బూతు అర్ధమైనా ఉండాలన్న నా భ్రమలు పటాపంచలు చేసిన పాట ఇది.సిట్యుఏషన్ కీ పాటకీ సంబంధం ఎలాగూ లేదు కనీసం డబుల్ మీనింగ్ ఐనా ఉంటుందనుకున్నా.అదీ దొరకలేదు.తట్టీ తట్టని పొడుపు కథలా చిత్ర హింస పెట్టి తర్వాత తెలుగు పాటకు అర్ధమే కాదు పర్ధం కూడా ఉండాల్సిన పని లేదని ఙ్ఞాన బోధ చేసింది.

ఇలాంటి పాటల్లో మరో మణిపూస
బస్సెక్కి వస్తావో బండెక్కి వస్తావో కారెక్కి వస్తావో రైలెక్కి వస్తావో"
ఏజంటులా మొదలెట్టాడేంట్రా బాబూ అనుకుంటూండగా.
"ఏదైనా ఎక్కేసెయ్ రా నా ఎదలో పక్కేసెయ్ రా "అంటుంది హీరోయిన్...ఇక ఆ కపిత్వ జల్లుల్లో తరించి తీరాల్సిందే గానీ చెప్తే వినవలసిన భావం కాదది.
మరో పాటలో
ఒరేయ్ నువ్వు నాకు నచ్చావురా ఒరేయ్ ఐలవ్యూ రా ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా ఒరేయ్ అదంతేరా"
అనిపిస్తాడా సినీ కపి.
సడన్ గా
ఆడపిల్ల ఒరేయ్ అందంటే ప్రేమలోన పడ్డట్టేరా" అని డిక్లేర్ చేస్తాడాయన..యుగయుగాలుగా మహామహులెందరో ప్రేమకు ఇంత డెఫినెట్ డెఫినిషన్ ఇవ్వలేదు.వీలుంటే పై వాక్యం ఆటోల లారీల వెనకాలా రాసుకుని గర్వించాలి.
ఇలా చెప్తూ పోతే.
"జడ పెట్టి కొడితే జబ్బరుపేట్లో పడతావ్ ఓరబ్బీ కొట్టేయనా.."
"చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే"
లాంటి జాతిరత్నాలు ఎన్నెన్నో.
పోనీ నేరం కాదు డైరెక్టరుది అన్నట్టు అవన్నీ ఆ స్థాయి పాటలు అనుకుందాం "తెలుగు భాష తీయదనం" అనే పాట సందర్భం ఉన్న పాట.పాపం ఆ పాట రాసినాయన మాత్రం తెలుగు భాషా సంఘం వారి గోడల మీద ఆర్టీసీ బస్సుల్లోనూ తెలుగు గురించి రాసిన సూక్తులు చక్కగా ఓ పుస్తకం లో ఎక్కించుకుని వచ్చి ట్యూన్ లో ఇమిడ్చేసి ఇరగదీసేసారు.
*****
ఎప్పట్నించో తెల్లవారుఝాముల్లో లేచి మరీ ఓ కల కని పడుకుంటున్నా. ఇలాంటి పాటలు(కనీసం ఏ అర్ధమూ లేకుండా) రాసేవాళ్లను అందర్నీ తెప్పించి ఆంధరికీ నిక్కర్లు వేసేసి లైన్ లో నుంచోబెట్టాలి. మాంఛి పచ్చి తాటి కమ్మ(కొసలు బాగా సూదిగా ఉండి దిగిపోవాలన్నమాట) ఒకటి పురమాయించి,దాంతో మోకాళ్ల కింద బాదుతూ...
నేను:ఇంకెప్పుడైనా (దెబ్బ
సదరుడు:అమ్మోయ్
నే:ఇంకెప్పుడైనా (మళ్లీ దెబ్బ)
స:అబ్బోయ్
నే:ఇంకెప్పుడైనా అలాంటి పాటలు రాస్తావా (దెబ్బ)
స:రాయనూ రాయనూ
నే:అలాంటి పాటలు
నే:మళ్లీ
నే:పారిపోకు దొరికితే చంపేస్తా
*****
మీరే నా పాలిటి తథాస్తు దేవతలు.ఓఖ్ఖసారిగా తథస్తు అనాలి సరేనా....1...2...3....

వేటూరి పాటే మంత్రము


వేటూరి అన్న మూడక్షరాల్లో ఓ సముద్రమంత వైవిధ్యం ఉంది.నిజానికి ఆ సముద్రంలో తెలుగు సినిమా పాట అన్న ముంతకు దక్కింది ముంతడు నీళ్లే.ఐనా,ఆ ముంతడు నీళ్లే మన మరుగుజ్జు మేధ పాలిటి చతుస్సాగర పర్యంతం ఐపోయింది.శంకరాభరణం లాంటి క్లాసిక్కూ,అడవి రాముడు లాంటి కసక్కూఒ ఒకేసారి రుచి చూసి అదే గొప్ప వైవిధ్యమనుకుంది వెండితెర.కానీ,ఆయన కవితావిశ్వరూపం వెండితెర గుక్కతిప్పుకోలేనంతటిదని అంటూంటారు ఆయన్ని బాగా తెలిసినవాళ్లు.

పోనీ వేటూరి వెండితెర యాత్రనే తీసుకున్నా తలవని తలపుగా "ఓ సీత కథ"లో అవకాశం వచ్చిన నాటి నుంచి మరణానికి కొన్ని వారాల ముందు "విలన్" వరకూ రాస్తూనే ఉన్నారు.సినీ గీతాల్లో ఇటు టేస్టుగా అమృతాన్ని అటు నిష్ఠగా మద్యాన్నీ కూడా అందించారు.అంతకంత ప్రతిష్ఠ అప్రతిష్ఠలు మూటకట్టుకున్నరు.

హనుమంతుడంత వారితో కుప్పిగంతులు వేయించి వెక్కిరించే అవగుణాలు కాసేపు పక్కన పెట్టి,ఆయన నోటి తుంపరలు లెక్కపెట్టకుండా ఆ కవితాగానాన్ని విందాం.

వేటూరి ప్రత్యేకతలు పదాలతో ఆట..లోతైన భావం...చిక్కని భాష

పదాలతో ఆట ముఖ్యంగా సన్నివేశ బలం,సందర్భ ఔచిత్యం లేని పాటల కోసం మొదలెట్టాననీ,తర్వాత తర్వాత బలమైన సన్నివేశాలను ప్రతిష్ఠించాల్సిన ఆలయంలా మాత్రమే పదాలను వాడాననీ...ఎన్నడూ పదాలకు పట్టం కట్టలేదని చెప్తారు వేటూరి. తెలుగు పదానికి చక్కిలిగింతలు పెట్టి పకపకా నవ్విస్తారు..ఆ పదాలతో పాటకు కన్నుకొట్టిస్తారు..మన నాలుకలపై నాట్యం ఆడిస్తారు.

"రాంబంటు"లో హీరో అమాయకత్వం గురించి రాస్తూ "సిగలోకి పూలంటే అరటిపువ్వు తెస్తాడు" అని ఊరుకోకుండా "అవకతవకడు","ముదురుబెండడు" లాంటి ముచ్చటైన ప్రయోగాలు చేసి ముళ్లపూడి వారికి ముద్దొచ్చేసారట వేటూరి.డబ్బింగ్ గీతాలు మారం చేస్తుంటే "అరబిక్ కడలందం" లాంటి పదాలు పుట్టించేసారు."తానానా తాన తానానన ఇది పల్లవి ఒక తింగరోడి గురించి రాయండి గురువుగారు" అని మాధవపెద్ది సురేష్ ట్యూనూ టైమూ ఇస్తే..ఆశుకవి ఆ సుకవి అరక్షణం ఆగకుండా "ఏముంది ఏ బీ సీ రాని ఏబ్రాసి"అన్నార్ట మరి,"తర్వాతి లైనో" అని నసిగితే.."ఒకటి ఇంగ్లీష్ అయ్యింది కదా ఇప్పుడు తెలుగు రాస్కో ఓ అంటే ఢం రాని సన్నాసి",అనేసార్ట.ఆ పాట పల్లవి ఇలా వచ్చింది..

"ఏ బీ సీ రాని ఏబ్రాసిరో వాడు ఓ అంటే ఢం రాని సన్నాసిరో"

అదీ వేటూరి వేగం పద చమత్కారం.

దర్శకుడు స్వేచ్ఛ ఇచ్చిన చోట "అచ్చెరువున అచ్చెరువున(ఆ+చెరువున)"..."ఆబాలగోపాలము ఆ బాలగోపాలుని" అంటూ పూర్వకవుల పంథాలో అలంకారాల(యమకం అని గుర్తు)తో చెలరేగాడు."అడవిరాముడు"లాంటి మాస్ సినిమాలో జనానికి తెలియకుండా

"ఆరేసుకోబోయి పారేసుకున్నాను

కోకెత్తుకెళ్లింది కొండగాలి"

అంటూ అచ్చమైన పదహారణాల సీసపద్యం రాసి మెప్పించనూ గలడు(గణాలూ యతులూ కూడా కించిత్ తప్పలేదు) "గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన

గోధూళి ఎర్రన ఎందు వలన" కూడా సీసమే(రెండవ పాదంలో యతి సరిపోయిందో లేదో ఒకసారి చూడండి) "ఆనంద్"లో "నువ్వేనా నా నువ్వేనా"పాట పాడిన కె.ఎం.రాధాకృష్ణ గొంతులో ఒక గస ఉంటుంది..మాంత్రికుడు వేటూరి సరిగ్గా ఆయన గొంతుతోనే "గసగసాల కౌగలింత గుసగుసల్లె మారుతావు" అని పాడించారు .పైగా గసగసాల కౌగలింత అన్న ప్రయోగం....గసగసాల-గుసగుసల్లే శబ్దాలంకారం నిజంగా అద్భుతం.

ఇక"మమ్మీ పోయి డాడీ వచ్చే" (మిష్టర్ పెళ్లాం) మరో గిలిగింత.

"అంట్లు తోమే ఆడది జంట్స్ కు లోకువ చూడు గాజులు తొడిగే శ్రీమతి ఫోజులు చెల్లవు నేడు" వంటివి మధ్యలో "టింగనాలు" లాంటివి వెయ్యడం.మొత్తానికి ఆ పాట చమత్కారప్రియులకు విందుభోజనం.

ఇంక ఆయనలో మరో కోణం భావ గాంభీర్యం.నిజమైన కవిత్వం రాయాలంటే ఓ జీవితకాలం తపస్సు చెసి పుట్టాలి.అదే కవిత్వం అర్ధం చేసుకోవాలంటే పది జన్మలు తపస్సు చేసి పుట్టాలంటారు.ఆయన భావాల్లో లోతు చూడాలంటే ఈ చిన్ని ప్రయత్నం చాలదు.కానీ నాకు తెలిసినదాన్ని పంచుకోవడంలో తప్పు లేదుగా.

"సూర్యుడైనా

చలవ చంద్రుడైనా

నింగి చుక్కలైనా

అష్ట దిక్కులైనా

నువ్వైనా నేనైనా

నీవైనా అహ నావైనా

సంద్రాన మీనాల చందమే" అని రాశారొక పాటకు సాకీగా.ఏదైనా సరే సముద్రంలో ప్రతిబింబంగా పడినప్పుడు చేపల్లా చలించాల్సిందేనని భావం.సముద్రం ఎవరినైనా తన బిడ్డలైన చేపపిల్లల్లానే చూస్తుందని ఆ సంద్రం పెంపుడు బిడ్డలైన జాలరులు పాడుకోవడం అబ్బబ్బా మహప్రభో మహత్తరం.

"తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా ...కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా" అన్న వాక్యం కులం మూలాల్ని ఎలా ప్రశ్నిస్తోందో చూడండి.

వేటూరి ఊహల్ని మనముందు బొమ్మలా కళ్లకు కడతారు.అలవోకగా రాసే క్రమంలో స్థల కాలాల్ని నిర్దేశించి వదులుతారు. ఒక రాత్రి ప్రేయసీ ప్రియులు కారులో షికారుకెళ్లే సందర్భం వస్తే బుర్రబద్ధలు కొట్టుకోరు.

"యమునా తీరం....సంధ్యా రాగం నిజమైనాయి కలలు ఈలా రెండు కనులలో" అని ఊరుకుంటారు నిజానికి అది యమునా తీరం కాకున్నా..అప్పుడు సంధ్యా సమయం కాకున్నా.

"నందికొండ వాగుల్లో నల్లతుమ్మ నీడల్లో చంద్ర వంక కోనల్లో సందెపొద్దు చీకట్లో" అంటూ భయాన్ని కళ్లముందుకు తెస్తారు. "మాటే మంత్రం" అన్నారు కానీ వేటూరి పాటే మంత్రం అని అర్ధమయ్యింది మనకు.

"వేణువై వచ్చాను భువనానికి...గాలినై పోతాను గగనానికి" అంది ఆయన పాళీ.మనం ఇంత శరీరం(వేణువు)తో ఈ భూమ్మీదకు వచ్చామనీ..ప్రాణం(గాలి)గా నింగికి పోతామని అర్ధం.మధ్యలో ఈ జీవితం వేణుగానం.అలాగే ఈ నాడు వేటూరి అనే వేణువు లేదు..ఆ వేణువులో గాలీ లేదు.ఆ వేణుగానం మాత్రం ప్రతీ తెలుగు గొంతులో ప్రతిధ్వనిస్తుంది.

పుట్టిన ప్రతివాడికీ ఋషి ఋణం ఉందంటారు పెద్దలు.పాడుకున్న ప్రతీ పాటకూ కవిఋణం ఉంటుంది.ఈ టపా ద్వారా నేను కొంతైనా తీర్చుకోదలిచాను.మీ వంతుగా మీరూ ఆయన పాటల్ని వాటిలో మీకు కనిపించిన ప్రత్యేకతల్నీ కామెంట్లుగా రాయండి.ఆ మహానుభావుకుడు పరమేశ్వరునిలో ఐక్యం పొందాలని ఆశిస్తున్నాను.

"సిరా"వెన్నెల సీతారామ శాస్త్రి

తెలుగు సినీ గీతానికి అసుర సంధ్య అనదగ్గ సమయంలో ఉదయించి సిరివెన్నెల కురిపించిన చందమామ ఆయన.పైకి అందరికీ తేలికగా అర్ధమౌతూనే ఎంతో నిగూఢమైన భావ గాంభీర్యాన్ని కలిగిన కలం ఆయనది.ఆయనే సిరివెన్నెల సినిమాతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా మారిన చేంబోలు సీతారామ శాస్త్రి."అడవిగాచిన వెన్నెల" అన్న సామెతని చమత్కారంగా "వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా"అంటూ మార్చిన చమత్కారం..ఆయన సొంతం."పడమర పడగలపై వెలిగే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరీ తూరుపు వేదికపై వేకువ నర్తకివై రాత్రిని వెలిగించే కాంతులు చిందనీ"అనే భావ గాంభీర్యం ఆయన వరం.కె.విశ్వనాథ్ వల్ల వెలుగులో కి వచ్చిన చేంబోలు సీతారామ శాస్త్రి "సిరివెన్నెల" సినిమాలో అన్ని పాటలు ఘన విజయాలు సాధించడం వల్ల తేలికగా సినీ రంగం లొ స్థిరపడ్డారు అనుకుంటాము సాధారణం గా.కానీ సిరివెన్నెల తరువాత వచ్చిన అవకాశాలను ఆయన ఉపయోగించుకో లేకపోయారట.అప్పట్లో ఆయన ఇలాంటి పాటలే హిట్టవుతాయనుకునే దర్శకుల వల్లా,అక్కడకక్కడే రాయమనే నిర్మాతల వల్లా చాలా ఇబ్బంది పడ్డారుట.మెల్లిగా ఈయన సిరివెన్నెల లాంటి వాటికి తప్ప కమర్షియల్ సినిమాలకు పనికి రాడనే పేరు వచ్చేస్తోంది.సరిగా అప్పుడే దర్శకుడు వంశీ సిరివెన్నెలలో కమర్షియల్ గా రాస్తూ కవితాత్మను వదలని లక్షణాన్ని గమనించారు.దాంతో ఆయనకు కమర్షియల్ బాణీ అలవాటుచేశారు వంశీ.అలా వచ్చిందే లేడీస్ టైలర్.ఇక వేటూరిలా అలవోకగా రాయలేని ఇబ్బందిని ఓ చిట్కా కనిపెట్టి పరిష్కరించుకున్నరు.అదే ఈవెనింగ్ సిట్టింగ్స్.సాయంత్రం సందర్భం చెప్పించుకుంటే రాత్రంతా టైం వస్తుందని కనిపెట్టారాయన. అలా సీతారామ శాస్త్రి హిట్టయ్యారు.ఇదంతా వదిలి ఆయన పాటల గురించి చెప్పుకుందాం.సీతారామ శాస్త్రి పాటల్లో నేను గమనిచిన ప్రత్యేకత ఏంటంటే..అందరూ ఒప్పుకునే దాన్ని కాక వేరేదాన్ని చెప్తాడు..అరే ఇదేంటి అని ఆశ్చర్యపోయే లోగా మనం కూడా అంగీకరించేంతటి వివరణ ఇస్తారు.దీనికి ఉదాహరణ ఎం.ఎస్.రాజు అనుభవాల్లోంచి చెప్పొచ్చు.మొదట్లో ఎం.ఎస్.రాజుకు సీతారామశాస్త్రి పట్ల మంచి అభిప్రాయం ఉండేది కాదు.కానీ "ఒక్కడు" మొదటి పాట ఎవరూ రాయలేకపోతే తప్పక సీతారామ శాస్త్రిని సంప్రదించారాయన.శాస్త్రి గారు తర్వాతి ఉదయం ఎం.ఎస్.రాజు గారికి పాట పల్లవి వినిపించడం మొదలుపెట్టారు."రాముణ్నైనా కృష్ణుణ్నైనా కీర్తిస్తూ కుర్చుంటామా"అన్నారు శాస్త్రి గారు."కాకపోతే ఏం చేస్తాం"అని ఆశ్చర్యపోయారు రాజు మొదటిలైనే యాంటీ సెంటిమెంటా అని.."వాళ్లేం సాధించారో కొంచం గుర్తిదాం మిత్రమా...సంద్రం కూడా స్తంభించేలా మనసత్తా చూపిద్దామా(రాముడు) సంగ్రామం లో గీతాపాఠం తెలుపమా(కృష్ణుడు)"అని పూర్తి చేసేసరికీ ఎం.ఎస్.రాజు అనుమానాలు పటాపంచలైనాయట.అప్పట్నించీ ఆయన ఆస్థాన కవి సిరివెన్నెలే.
సినిమాలో ఆయన రాసిన పాటలు ఎలాగూ తెలుస్తాయి కనుక మనకు తెలిసిన సిరివెన్నెలను వదిలి తెలియని సీతారామశాస్త్రి కవితలు కొన్ని చూడండి.
"అమృత మధనం" అనే కవితలో కొన్ని పంక్తులివి
"అసురులైన వారందరు
అనిమేషులైన వారందరును
అమృతత్వమందగా నెంచిరి
యమపాశమను ప్రశ్న మడియించవలెనంచు
జగతి జలధి మథియించిరి"
ఆ జగతి అను జలధి ఎలా ఉందటా
"సత్యమును అగాధమున నిల్పి
సర్వవర్ణములు కలిపి
స్వేతార్ణమను భ్రాంతి గొలిపి
ఆటుపోటుల బ్రతుకు కాచి వడబోసినది
ఆటపాటల లోన పాప వలె తోచినది
జగతియను జలధి"
భారతీయ తత్వం గురించి ఆయన రాసిన గేయం ఇది.
యోగులు సాగిన మార్గమిది
లోకములేలిన దుర్గమిది
శాశ్వత శాంతుల స్వర్గమిది
వేదధ్వజ ఛాయలలో సాగిన భరతావని దిగ్విజయమిదియోగులు
రాతికి రప్పకి చెట్టుకి చేమకి చరాచరమ్ములనన్నిటికి
మత మస్తకములు మతులు సలుపు పరమోన్నతమౌ ఘన సంస్కృతిది యోగులు
వినయము విద్యా భూషణమనుకొను విమల మనస్కుల నేల ఇది
దురహంకారము దరి చేరని మహనీయ జీవనుల మార్గమిది
సరళ జీవనము విరాట్ చింతనము అవిరళ సరళిగనెంచినది
ఆద్యంతములకు అటునిటు నిలచిన ఆనందము పరికించినది 2
గీతా జ్యోతిని ఒసగి చేతముల చేయూతగ నడిపించినది
అజ్ఞానమునకు అందని ద్రష్టను కాంచిన కాంచన దుర్గమిదియోగులు
కాలుడు రేపిన చీకటి ధూళి
రక్కసి మూకల కర్కశ కేళి
విసరిన వికృత విష వలయమ్మున విస్మృతి పొందిన విభవమిది2
పండిన పాపము పిండగ కేశవుడవతరించు సంకేతమిది
హలాహలమ్ములను అరాయించుకును అమృత హృదయుల స్వర్గమిది యోగులు
సీతారామశాస్త్రి గారు సాధారణంగా ఒకే పాటకు ఎన్నో వెర్షన్స్ రాస్తుంటారు.అలా "మనసంతా నువ్వే"లో "ఎవ్వరునెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమా" పాటకు ఆయన రాసుకున్న(సినిమాలో లేని) వెర్షన్ ఇది..
1:ఎన్నెనెన్నెన్నో రంగులతో కనిపిస్తుంది ఈ ప్రేమా
రంగులకలలే కాంతి అని నమ్మిస్తుంది ఈ ప్రేమా
వర్ణాలన్నీ కలిసుండే రవికిరణంకాదీ ప్రేమా
తెల్లని సత్యం తానంటూ ప్రకటిస్తుంది ఈ ప్రేమా
2లైలా మజ్ఞూ గాధలనే చదివిస్తుందీ ఈ ప్రేమా

తాజ్మహల్ తన కోట అని ప్రకటిస్తుందీ ఈ ప్రేమా
కలవని జంటల మంటలలో కనిపిస్తుందీ ఈ ప్రేమా
కలిసిన వెంటనె ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమా
3అమృత కలశం తానంటూ ఊరిస్తుందీ ఈ ప్రేమా

జరిగే మధనం ఎంతటిదో ముందుగ తెలపదు ఈ ప్రేమా
ఔనంటూ కాదంటూనే మదిని మధించే ఈ ప్రేమా

హాలాహలముకు నిలవండి చూద్దమంటుందీ ప్రేమా
3ఇంతకుముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమా
ప్రతి ఒక జంటతొ ఈ గాధే మొదలెడుతుందీ ఈ ప్రేమా
సీతారాములనేమార్చే మాయలేడి కద ఈ ప్రేమా
ఓటమినే గెలుపనిపించే మాయాజ్యూదం ఈ
ప్రేమా
చివరగా మా గురువుగారు ఒకాయన సీతారామశాస్త్రి గారి గురించి ఒక కవిత రాసారు.ఆ కవితకు విస్మయం పొందిన శాస్త్రి గారి జవాబు కవిత ఇది.
"నీ కరుణా కటాక్ష వరమో
క్రోధారుణ దృగ్వీక్షణమో

నీ కవితకు నేను అభిషక్తుడనో
శబ్దాటవిన అభిశక్తుడనో
గీర్వాణీ నా జననీ ఏలా శోధించెదవు"

కవిత రాసినది ఒక మనిషి కాదని అతనిలోని సరస్వతి అని భావించి.ఇది వరమా శాపమా అని ప్రశ్నించుకుంటున్నారు కవితాత్మకంగా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తెలుగు చిత్రసీమకు అష్టనందులతో అపర పరమేశ్వరుడిలా అదిలిస్తూ..నూరేళ్లూ చల్లగా బ్రతకాలని ఆయన పుట్టిన రోజు సందర్భంగా కోరుకుంటున్నాను.

కులం తప్పేలా అవుతుంది???

కులం అంటే వృత్తి వల్ల ఏర్పడిన సామాజిక కట్టుబాటు.వాళ్లలో వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల,ప్రత్యేకమైన ఆహార వ్యవహారాలు ఉండడం వల్ల మరింత బలవత్తరమైంది.భారత దేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి ఆనాడు.వాటన్నిటికీ అలౌకిక లక్ష్యాలు(నాన్ మెటీరియల్ గోల్స్)ఉండేవి.(సాక్ష్యం:కాకిలా వందేళ్లు బతికి ఏం లాభం,చచ్చేటప్పుడు మూటకట్టుకు పోతామా లాంటి వాడుకలు ఆనాడు చాలా మామూలు).ఇక వర్ణం భగవంతుడు సృష్టించినది.అవి నాలుగు బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర..అందునా మనిషి లోపలి గుణము,బయటి పని బట్టి నిర్ణయమౌతాయి.పైగా పుట్టుకతో అందరూ శూద్రులు మిగతా వర్ణాలు ఎవరికి వారు సంతరించుకోవాలని చెప్పారు.ప్రపంచంలో ఎవరైనా ఈ నాల్గింటి లో ఒకడై ఉంటాడు.ఈ రెండిటికి సంబంధం చెప్పాలంటె...కులం కొలను లాంటిదైతే వర్ణం రూపం లాంటిది.మీ రూపం కొలను ప్రశాంతంగా ఉన్నప్పుడు కనిపిస్తుంది చెదిరిపోతే చెదిరిపోతుంది.అలా అని రూపం లెదనలేము గా.అలాగే ఒక నాడు కులం వర్ణాన్ని చక్కగా ప్రతిబింబించింది.ఈ నాడు చాలావరకు ప్రతిబింబించలేక పోతోంది.నేడు మీరు అనుకునే కుల స్వరూపం వేరు నాటి కుల వ్యవహారాలు వేరు. పైగా ఆనాటి ఆలోచనా ధోరణి వేరు నేటి ఆలోచనా ధోరణి వేరు.ఈ నాడు డబ్బు కోసం ఒకడి కింద బానిసలా పనిచేస్తారు రాజులబ్బాయిలు,సాఫ్ట్వేర్ కంపెనీ కొలువుకోసం మందు పుచ్చుకుంటారు బ్రాహ్మణులు,తల్లిని తండ్రినీ వదిలి డబ్బు కోసం అమెరికా వెళ్తారు..కానీ ఆనాడు మహా మహా యుద్ధాలు చేసిన ఖడ్గ తిక్కనాది నియోగి బ్రాహ్మలు కూడా దేహ దారుఢ్యం వంకన మాంసాహారం తినలేదు.మన ప్రాధాన్యాలు డబ్బు,అధికారం మొదలైనవి...అలా ఉంటాయి కాలానుగుణ ఆలోచనా విధాన మార్పులు అలాంటి రోజుల్లో ఉన్న మీరూ నేనూ ఆనాటి కులాచారాల్ని తప్పు పడుతున్నాం.హాస్యాస్పదం.నాటి దేవదాసీ కులం గురించి మాట్లాడతారు మనవాళ్లు.సాని అనే పదం స్వామిని అనే పదం నుండి వచ్చిందని,దేవాలయాల్లో నాట్యం ప్రదర్శిస్తూ ఆ స్వామికి అంకితమై సన్యాసినులుగా జీవించే ఆచారం తో మొదలైందని అందరికి తెలుసు.ఎన్నో వందల ఏళ్లపాటూ కొనసాగిన ఆ ఆచారం చివరకు దురాచారమైందని కూడా తెల్సు.ఏ ఆచారమైనా కాలక్రమేణా రూపు మార్చుకుంటుంది.అలాంటప్పుడు వదిలెయ్యాలి దానికి కొంత సంఘర్షణ అవసరమౌతుంది.ఇంత మాత్రం చేత ఒకనాడు అసలు ఆ ఆచారం ఉదాత్తంగా ప్రారంభమవ్వలేదనడం దారుణం కాదా.ఆనాడు వేశ్యలూ సంసారులూ ఉన్నారు కానీ నేడు వేశ్యలకీ సంసారులకీ తేడా తెలియని పరిస్థితి వస్తోంది.ఆ విషయం పట్టించుకోకుండా ఏనాడో ఎదో జరిగిందంటారు.అదీ మనవాళ్ళ కథ. ప్రతీ కులం గురించీ ఇంతే.ఐతే ఆయన మావాడు ఈయన మావాడు అనడం లేదంటే కులం దురాచారం దాన్ని వేళ్లతో పెకలిద్దాం అనడం.నేడు కులం అని చెప్పుకునేది ఒక రాజకీయ అస్త్రం.ఈ కులం వేరు ఆనాటి కులాల లక్షణాలు వేరు.ఆ తేడా తెలియక మాట్లాడుతున్న వారే పైన చెప్పిన రెండు రకాల వారూనూ. నేడు రాజకీయ అవసరాల వల్ల ఇఫ్తార్ విందులకు వెళ్లి తురక టోపీలు తగిలించుకునే కమ్మ వారు సంస్కృతి మీద దాడిని సహించలేక ముస్లీం పాలకులను చీల్చి చెండాడిన కాకతీయుల పేర్లూ మునుసూరి నాయకుల బొమ్మలూ వారి కుల సంచికలో వేసుకోవడానికి ఏ మాత్రం అర్హులు? భారత దేశంపై దాడి చేస్తున్న ఇస్లాం సంస్థలను ఉద్దేశ్యాలను స్పష్టంగా చూస్తూ మతానికీ రాజకీయానికి సంబంధం లేదనే రెడ్లు డిల్లీ సుల్తానుల అకృత్యాలను ఎదిరించి ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడినా మల్లరెడ్డి,వేమారెడ్డి తదితరులు మావాళ్ళే అంటే ఆ వీరిలు స్వర్గం లో కూడా దుఃఖిస్తారు. ఇక రెండో రకం జనానికి కులానికి వర్ణానికి భేదం గానీ,నేడు కులం అనుకునేదానికి నాటి కులాచారాలకీ తేడా గానీ తెలియదు.కానీ కులాన్నీ వర్ణ వ్యవస్థని(నిజానికి మనది కులవ్యవస్థ వర్ణం వ్యవస్థ కాదు అది కూడా తెలియని మేధావులు వారు)ఖండిస్తుంటారు. బ్రాహ్మణీక ధోరణి అని రాసేస్తుంటారు.ఇటీవల భరత్ ఝంఝన్వాలా అనే కాల్మిస్ట్ చెప్పినట్టు..బ్రాహ్మణుడు అంటే అధికారేఛ్ఛ లేని రాజకీయ నాయకులు.మన మహా మంత్రులు సేనానులు అటువంటి వారే వారు రాజరికాన్ని తృణీకరించిన వారు.ఆనాటి దొండపూడి అన్నయ మంత్రి సుల్తాంపూర్(ఊరుగల్లును)జయించి మునుసూరి కాపయనాయకుని రాజును చేశాడు.అలానే పీష్వా బాజీరావ్ 41 యుద్ధాలు గెల్చినా ఛత్రపతిగా సిం హాసనం అధిష్టించలేదు.గాంధీజీ స్వాతంత్ర్యానంతరం ప్రధాని పదవి తృణీకరించారు.
అయినా నిద్ర పొయే వాళ్లను లేపచ్చు గానీ ....

కను రెప్పలపై ముద్దాడే కథలు అవి


కొన్ని కథలు ముద్దు పెట్టుకున్నాయండీ నన్ను..నిద్దట్లో ముద్దు పెట్టుకోకూడదు అన్నా వినకుండా పాపాయిని ముద్దు పెట్టుకుంటామే అలాగ.తిలక్ అన్నట్టు పండిన మొగలిపొత్తి మొదలులా వాసన కొడ్తాయి.వంశీ రాసినట్టు చలికాలంలో దుప్పటి సందుల్లోంచి దూరి కితకితలు పెట్టే గోదారి గాలిలా పులకలు రేపుతాయి.సత్యం శంకరమంచి అన్నట్టుగా గాలికీ వెన్నెలకీ కూడా వాటి వాసన వచ్చి గుబాళిస్తాయి.అలాంటి కథలు ఉంటాయా అంటే ఉంటాయి.
కథలు భలే ఉంటాయి మొత్తంగా మనల్ని చుట్టు ముట్టేస్తాయి.కళ్ళకు కట్టినట్టు అన్న మాటని వెక్కిరిస్తూ అవి వినిపిస్తాయి గుబాళిస్తాయి నిమురుతాయి చదువుతున్నంతసేపే కాదు అయ్యిపోయాకా కూడా.
మధ్యన ఉపన్యాసంగా చెప్పవలసినవి కథలుగా రాసి సంభాషణల్లో చెప్పే టైపు కథలు వేస్తున్నారు గానీ నాలుగేళ్ళ క్రితం వరకూ ఈనాడు ఆదివారంలో కథలు బావుండేవి.
సేంపిల్ కి పుష్కరాల టైం లో "వెండి పట్టీలు"అని ఒక కథ వచ్చింది విషయం ఏంటి అంటే చెప్పడం కష్టం గానీ మన చుట్టూ గోదావరి ఆ యాస ఆప్యాయతలు ఆవకాయ వెన్నపూసా ఇలాంటి దినుసులతో ఒక అందమైన బొమ్మరిల్లు కడ్తుంది ఆ కథ చదివినంత సేపు,పైగా వెండి పట్టీల శబ్దం వింపిస్తూనే ఉంటుంది త్రూ-అవుట్. ఇంకో కథ "మనసులో వాన" ఇదీ పై కథ లాంటిదే మంచి కాఫీ లాంటి కథ(ఫీల్ గుడ్ అన్న మాట).కానీ కొంత సందేశం ఉంటుంది.
రస రాజు గారు రాసిన మరో కథ(పేరు గుర్తు లేదు).అందులో ఒకడు నోటి దురద కొద్దీ ఊరి పెద్ద ఇంట్లో భోజనాలు అయ్యాకా అర్ధాకలి తో పంపేసారని వాగుతాడు.అప్పటి నుండి ఆ ఊరిపెద్ద బావ కం అనుచరుడు నరహరి వాళ్లింట్లో ఏ భోయనాలు ఉన్నా ఆ నోటి దురద కాండిడేట్ ని పిల్చి భోజనం పెట్టీ పెట్టీ చంపేస్తాడు.అసలు నవ్వు ఆపుకోలేక మనం భోజనం చెయ్యలేక వాడు చావాలి పొట్ట చెక్కలై.
ఇంక అప్పుడెప్పుడో చదివిన బాపు గారి "మబ్బూ-వానా-మల్లె వాసనా"కూడా మతి పోగొట్టి మనసుని నింపే కథే.మన హీరోకి తన భార్య చెంప మీద చెంప ఆనించుకుని వాన చూడాలని,మల్లె పూలు పెట్టుకుంటే గాఢంగా వాసన చూసి సీతా నీ జడలో ఈ మల్లేపూలు ఎలా ఉన్నాయో తెలుసా నల్లటి ఆకాశం లో చంద మామలా ఉంది అనాలని..కొన్ని ఫేంటసీలు ఉంటాయ్.కానీ చెంపా చెంపా ఆనించుకుని వాన చూద్దామని తెల్లవారు ఝాము లేపాబోతే "హేవిటల్డీ నిద్దరొస్తోందల్డీ"అని ఆఆవలిస్తుంది.మన వాడి మూడ్ అవుట్.ఇంక మల్లెపూల డైలాగ్ చెబుదామంటే "సీతా నీ నల్లని సవరంలో..."అని సవరించాల్సి వస్తుందని ఆ ప్రయత్నం కూడా విరమించుకుంటాడు.పైగా తన ఫాంటసీలకు అడ్డు పడడానికి సరిగ్గా భోంచేసి సీత దగ్గరకి వెళ్లబోతుంటే సైంధవుడిలా "అమెరికా వాడు పాపం ఆ కువైట్ మీద పడ్డాడేంటి.?"అని మొదలెట్టి అంతర్జాతీయ రాజకీయాలకూ తమ ఊరి పంచాయితీ గొడవలకీ దిక్కుమాలిన పోలికలు చెప్తూ హింసించే మామ గారు(అత్తారింట్లో ఉండగా లెండి).ఇలాంటివే కొన్ని సున్నితమైన హాస్య గుళికలు..అన్నింటికన్నా పాత హిందీ రొమాంటిక్ సాంగ్సూ,మల్లెల వాసన,వెన్నెల వాసన...చుట్టుముట్టేస్తాయి మనల్ని.
అందుకని చెప్పొచ్చేదేంటంటే కథలంటే అవేవో కొన్ని నీతులు చెప్తూ మొత్తం సమాజాన్ని మార్చిపారెయ్యాల్సిందే అని కంకణం కట్టేసుకున్నారేమో అనిపిస్తోంది ఈ మధ్య కథలు చదివితే. ఇలాంటి కథలు కూడా రాయొచ్చు కదా.